ఓటీటీ రివ్యూ: 'బటర్ ఫ్లై' (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

  • అనుపమ తాజా చిత్రంగా రూపొందిన 'బటర్ ఫ్లై'
  • ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  
  • కిడ్నాప్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే ఎమోషనల్ డ్రామా 
  • అనుపమను కేంద్రబిందువుగా చేసుకుని అల్లిన కథ
  • ఆమె యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్
తెలుగు ... తమిళ .. మలయాళ భాషల్లో అనుపమ పరమేశ్వరన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక కన్నడ భాషా ప్రేక్షకులకు కూడా అనుపమ పరిచయమే. ఈ నేపథ్యంలో ఈ మధ్య అనుపమ చేసిన 'కార్తికేయ 2' ... ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన '18 పేజెస్' అనూహ్యమైన రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజా చిత్రమైన 'బటర్ ఫ్లై' .. 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. రవిప్రకాశ్ .. ప్రసాద్ .. ప్రదీప్ నిర్మాణంలో ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూద్దాం. 

కథలోకి వెళితే .. వైజయంతి (భూమిక) గీత (అనుపమ) ఇద్దరూ ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, ఒక ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఈ అక్కాచెల్లెళ్లను బంధువులెవరూ పట్టించుకోరు. అనాథ శరణాలయంలో ఉండలేక అక్కడి నుంచి పారిపోతారు. కాలక్రమంలో వైజయంతి ఎన్నో కష్టాలు పడి తాను చదువుకుంటూ గీతను చదివిస్తుంది. వైజయంతి లాయర్ గా పేరు తెచ్చుకుంటుంది. గీత ఒక కంపెనీలో సీఏగా పనిచేస్తుంటుంది. 

వైజయంతికి వివాహమవుతుంది .. వారికి బన్నూ - చిన్నీ అనే ఇద్దరు పిల్లలు కలుగుతారు. ఆమె భర్త (రావు రమేశ్)  కూడా లాయర్ గానే పనిచేస్తుంటాడు. అతని ధోరణి నచ్చక వైజయంతి దూరం పెడుతుంది. అతని నుంచి విడాకులు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే గీత .. విశ్వ (నిహాల్) ప్రేమలో పడుతుంది. అతని విషయం వైజయంతితో చెబుతుంది. వచ్చే సండే అతణ్ణి తమ ఇంటికి తీసుకురమ్మని చెబుతుంది వైజయంతి. 

జైల్లో ఉన్న డేగల శీను అనే నేరస్థుడు తన కేసును వాదించమని తన మనుషులను వైజయంతి దగ్గరికి పంపిస్తాడు. ఆ కేసును ఆమె వాదించకపోతే, ఆమె ఇద్దరి పిల్లలు స్కూల్ నుంచి .. చెల్లెలు ఆఫీస్ నుంచి ఇంటికి రారని బెదిరిస్తారు. ఆ మాటలు లెక్కచేయని వైజయంతి ఒక ముఖ్యమైన పనిపై ఢిల్లీ వెళుతుంది. ఆమె అలా వెళ్లగానే వైజయంతి పిల్లలు మిస్సవుతారు. 

 టెన్షన్ లో ఉన్న గీతకి కిడ్నాపర్ కాల్ చేసి లక్షలకి లక్షలు తీసుకుంటూ ఉంటాడు. కానీ పిల్లలను మాత్రం ఆమెకి అప్పగించడు. తన అక్కయ్య ఆ రోజు రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేలోగా పిల్లలు ఇంట్లో ఉండేలా చేయాలని గీత నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన పరిణామాలు ఎలాంటివి? వైజయంతి తన భర్త నుంచి విడిపోవాలనుకోవడానికి గల కారణం ఏమిటి? అనేదే కథ.  

'బటర్ ఫ్లై' .. ఇది హైదరాబాదులోని ఒక అపార్టుమెంటు పేరు. ఈ అపార్టుమెంటులోని ఒక ఫ్లాటులో జరిగే కథ ఇది. ఈ సినిమాలో భూమిక ఉన్నప్పటికీ ఆమె పాత్ర నామ మాత్రం. కథ అంతా కూడా అనుపమ పరమేశ్వరన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మార్నింగ్ ఫ్లైట్ కి భూమిక ఢిల్లీ వెళుతుంది .. ఆ రాత్రికే వస్తానని చెబుతుంది. ఆమె అలా వెళ్లగానే ఆమె పిల్లలు కిడ్నాప్ అవుతారు. అక్క వచ్చేసరికి ఆమె పిల్లలను సురక్షితంగా ఇంటికి తీసుకురావాలనేదే అనుపమ ఉద్దేశం.

అలా ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే కథ ఇది. అక్క పిల్లల కోసం అనుపమ పడే టెన్షన్ చూసే ప్రేక్షకులు కూడా టెన్షన్ పడటం మాత్రం ఖాయం. సాధారణంగా ఈ తరహా డ్రామాల్లో కిడ్నాపర్ వికృతంగా వ్యవహరించడం .. అటు పిల్లలను శారీరకంగా హింసిస్తూ, ఆ కుటుంబీకులను మానసికంగా హింసిస్తున్నట్టుగా చూపిస్తుంటారు. కానీ ఈ కథలో అలాంటివేం కనిపించవు. కిడ్నాపర్ కాల్ చేసి డబ్బుకోసం అనుపమను ఉరుకులు పరుగులు పెట్టించడమేనా? అనుకుంటున్న సమయంలోనే అసలైన ట్విస్ట్ వస్తుంది. 

మొదటి నుంచి చివరి వరకూ కూడా కిడ్నాపర్ ఎవరనేది ఎవరూ ఊహించలేరు. ఇక పిల్లలు ఎవరి బందీలుగా ఉన్నారనేది రివీల్ చేసిన తరువాత కూడా డ్రామా నడుస్తుంది. ఆ సస్పెన్స్ వీడిన తరువాత నడిచే డ్రామాలో పస ఉండదు. ఆ తరువాత కిడ్నాపర్ అనుపమకు ఎదురుగా వచ్చినప్పుడు .. ఆ సస్పెన్స్ ను రివీల్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. కిడ్నాపర్ తన ఉద్దేశం ఏమిటనేది ఇక్కడ కూడా చెబుతాడు గనుక సమస్య ఉండేది కాదు. 

సాధారణంగా ఒక ప్రధానమైన పాత్ర చుట్టూ కొన్ని బలమైన పాత్రలు ఉండటం వలన ఆ కథ మరింత రసవత్తరంగా నడుస్తుంది. కానీ ఇక్కడ అనుపమ పాత్ర చుట్టూ కొన్ని చిన్న చిన్న పాత్రలే ఉంటాయి. ఆ పాత్రలు ఎంత బలమైనవనేది చివర్లో తెలుస్తుంది. ఈ అంశమే ఈ కథకు కొత్తదనాన్ని తీసుకొస్తుంది .. నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. అనుపమ పలికించిన ఎమోషన్స్ ఈ సినిమాకి హైలైట్. 

అర్విజ్ అందించిన బాణీల్లో చిత్రపాడిన 'అమ్మా నీకు ఎలా చెప్పాలో గాని' పాట బాగుంది. ఆవేదనా భరితమైన ఈ పాట సందర్భానుసారంగా అక్కడక్కడా ప్లే అవుతూ కథకి కనెక్ట్ చేస్తుంటుంది .. సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది. సమీర్ రెడ్డి ఫొటోగ్రఫీ .. మధు ఎడిటింగ్ ఓకే. దీనిని ఒక ప్రత్యేకమైన సినిమాగానే చూడాలి. ఇందులో లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు .. కామెడీ ఇవేవీ ఉండవు. తక్కువ బడ్జెట్ లో .. చిన్న చిన్న పాత్రలతో .. ఒక కథను ఎంత ఇంట్రెస్టింగ్ గా నడిపించవచ్చనేది నిరూపించిన సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.


More Telugu News