తెలంగాణలో 276 పోస్టుల భర్తీ.. రెండు నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్ పీఎస్సీ

  • విద్య, వ్యవసాయ శాఖల్లో నియామకాలు
  • జనవరి 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు
విద్య, వ్యవసాయ శాఖల్లోని ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా రెండు శాఖల్లోని 276 ఉద్యోగ ఖాళీలను పూరించనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 6 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

సాంకేతిక విద్యాశాఖలో 37 పీడీ పోస్టులు, ఇంటర్ విద్యాశాఖలో 91 పీడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. పోస్టుల వివరాలు, అర్హతలు తదితర వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల 6 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల(మల్టి జోన్-1 లో 100, మల్టి జోన్-2 లో 48 ఖాళీలు) భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. జనవరి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌ పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.


More Telugu News