నయాగరా జలపాతం గడ్డకట్టింది.. వీడియో ఇదిగో!

  • జలపాతం కాస్తా వింటర్ వండర్ ల్యాండ్ గా మారిందంటున్న నెటిజన్లు
  • నయాగరా దగ్గర ఆర్కిటిక్ వాతావరణం నెలకొందని వెల్లడి
  • మంచు తుపాన్ ప్రభావంతో వణుకుతున్న అమెరికా
మంచు తుపాను ప్రభావంతో అమెరికా అల్లాడుతోంది. న్యూయార్క్ స్టేట్ లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన నయాగరా జలపాతం గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల దాకా పడిపోవడంతో అందాల జలపాతం కాస్తా మంచు కొండగా మారిపోయింది. వాటర్ ఫాల్స్ దగ్గర ఆర్కిటిక్ వాతావరణం నెలకొందని స్థానికులు చెబుతున్నారు. జలపాతం గడ్డకట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. నీటి ప్రవాహం మొత్తం గడ్డకట్టి వింటర్ వండర్ ల్యాండ్ ను తలపిస్తోందని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. 

ఏటా శీతాకాలంలో జలపాతం తాత్కాలికంగా మంచుముద్దగా మారిపోతుందని, ఈ ఏడాది తుపాన్ ప్రభావంతో ఇది కాస్తా ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. శీతాకాలంలో జలపాతం గడ్డకట్టి టెంపరరీ బ్రిడ్జిగా మారేదని తెలిపారు. ఆ సమయంలో పర్యాటకులు మంచుపై నడుస్తూ నదిని దాటే వీలుండేదన్నారు. అయితే, 1912లో ఇలా నది దాటుతుండగా మంచు పెళ్లలు విరిగి ముగ్గురు టూరిస్టులు నదిలోపల పడిపోయారని చెప్పారు. అప్పటి నుంచి జలపాతంపై నడవడాన్ని ప్రభుత్వం నిషేధించిందని వివరించారు.


More Telugu News