దూసుకుపోతున్న అవతార్ 2.. ఇప్పటికే రూ.8,200 కోట్లు

  • నార్త్ అమెరికాలో 300 మిలియన్ డాలర్లు
  • మిగిలిన ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ డాలర్లు
  • మరో బిలియన్ డాలర్లు వసూలైతేనే లాభాలు
జేమ్స్ కామెరాన్ తీర్చిదిద్దిన అపురూప గ్రాఫిక్స్ చిత్రం అవతార్ 2 ( ద వే ఆఫ్ వాటర్) అభిమానుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బిలియన్ డాలర్లను (రూ.8,200 కోట్లు) వసూలు చేసినట్టు సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల అంచనా. ఈ స్థాయి వసూళ్లతో చిత్ర నిర్మాతల పంట పండిందని అనుకుంటే అది పొరపాటే అవుతుంది.

ఈ సినిమాపై తాము లాభాలు కళ్లజూడాలంటే కనీసం 2 బిలియన్ డాలర్లు (రూ.16,400 కోట్లు) ఆదాయం రావాలని జేమ్స్ కామెరాన్ ప్రకటించారు. అంటే లక్ష్యంలో సగమే ఈ సినిమా రాబట్టింది. అవతార్ సినిమాకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా మరో బిలియన్ డాలర్లను సులభంగానే వసూలు చేసుకుంటుందని భావించొచ్చు. బిలియన్ డాలర్లలో 300 మిలియన్ డాలర్లు ఒక్క నార్త్ అమెరికాలో వసూలు కాగా, మిగిలిన 700 మిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా వసూలైంది. మన దేశంలోనూ ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అవతార్ సినిమా వచ్చిన 13 ఏళ్లకు అవతార్ 2ని కామెరాన్ సినీ ప్రేక్షకులకు ఆణిముత్యంగా అందించారు. 




More Telugu News