టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి?

  • 175 స్థానాలను గెలవాలనే పట్టుదలతో జగన్
  • ఉత్తరాంధ్ర బాధ్యతలను సుబ్బారెడ్డికి పూర్తి స్థాయిలో అప్పగించాలని నిర్ణయం
  • సంక్రాంతి తర్వాత టీటీడీ ఛైర్మన్ గా భూమన నియమితులయ్యే అవకాశం
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాలకమండలిలో సైతం కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీటీడీ కొత్త ఛైర్మన్, పాలకమండలి సంక్రాంతి తర్వాత భాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. 

వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సీట్లను గెలుచుకునే విధంగా ఇప్పటికే ఆయన పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను జగన్ అప్పగించారు. ఇప్పుడు ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలను పూర్తి స్థాయిలో కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నారు. 

ఈ క్రమంలో టీటీడీ బాధ్యతల నుంచి తప్పించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై సుబ్బారెడ్డి ఫోకస్ చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీడీపీకి కంచుకోటగా ఉండే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పట్టు సడలకుండా ఉండేందుకు సీనియర్ రాజకీయవేత్త సుబ్బారెడ్డికి పూర్తి బాధ్యతలను జగన్ అప్పగించనున్నారు.


More Telugu News