పోలీసులకు నిష్పాక్షికత, ధైర్యం అవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • శీతాకాల విడిది కోసం హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి
  • నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ కార్యక్రమానికి హాజరు
  • పోలీసులు ప్రభుత్వంలో కీలకం అని వెల్లడి
  • పోలీసులకు పారదర్శకత ఉండాలని పిలుపు
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో కీలక విభాగం అని ఉద్ఘాటించారు. 

పోలీసులకు అప్రమత్తత, సున్నితత్వం, నిజాయతీ అవసరం అని తెలిపారు. పోలీసులకు నిష్పాక్షికత, పారదర్శకత, ధైర్యం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. పోలీసులు... పేదలు, బలహీనవర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 

దేశంలోని అన్ని రంగాల్లో మహిళా సాధికారత రావాలని ఆమె అభిలషించారు. స్కాండినేవియన్ దేశాల్లో పోలీసు శాఖలో 30 శాతం మంది మహిళలే ఉంటారని వివరించారు. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News