బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

  • హిందువులు అందరూ ఇంట్లో ఆయుధాలు ఉంచుకోవాలని ప్రగ్యా పిలుపు
  • లేదంటే కూరగాయల కత్తిని అయినా పదునుగా ఉంచుకోవాలని వ్యాఖ్య
  • మనపై దాడికి పాల్పడితే కాపాడుకునే హక్కు ఉందన్న బీజేపీ ఎంపీ
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి అదే విధంగా వ్యవహరించారు. కర్ణాటకలోని శివమొగ్గలో హిందూ జాగరణ వేదిక దక్షిణాది ప్రాంత వార్షిక సమావేశంలో భాగంగా, హిందువులకు అనుకూలంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. భోపాల్ ఎంపీ అయిన ఠాకూర్ మాట్లాడుతూ.. తమపై, తమ గౌరవంపై దాడుల పట్ల స్పందించే హక్కు హిందువులకు ఉందన్నారు. హిందువులు తమ ఇళ్లల్లోని కత్తులను పదునుపెట్టి ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికీ తమను తాము రక్షించుకునే హక్కు ఉంటుందన్నారు.

‘‘మీ ఇంట్లో ఆయుధాలు ఉంచుకోండి. లేదంటే కనీసం కూరగాయలను తరిగేందుకు వాడే చాకును అయినా పదునుగా ఉంచుకునేలా చూడండి. ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికీ తమను కాపాడుకునే హక్కు ఉంటుంది. ఎవరైనా మన ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడితే, బలమైన సమాధానం ఇవ్వడం మన హక్కు’’ అని ఠాకూర్ అన్నారు. లవ్ జిహాద్ కు పాల్పడేవారికి అదే రీతిలో సమాధానం చెప్పాలన్నారు. 

తమ పిల్లలను మిషనరీ స్కూళ్లకు పంపించొద్దని తల్లిదండ్రులను ఆమె కోరారు. అలా చేస్తే తమ కోసం వృద్ధాశ్రమాలకు ద్వారాలు తెరుచుకున్నట్టేనని హెచ్చరించారు. ‘‘ఇంట్లో పూజ చేయండి. మన ధర్మాలు, శాస్త్రాలను చదవండి. పిల్లలకు వాటి గురించి చెప్పండి. వారికి మన సంస్కృతి, విలువల గురించి తెలుస్తుంది’’ అని సూచించారు.


More Telugu News