ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు రాలేను.. ఈడీకి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లేఖ

  • ఈడీ విచారణపై రోహిత్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై రేపు విచారణ
  • ఈ కేసు విచారణపై హైకోర్టు తీర్పు తర్వాతే కార్యాచరణ నిర్ణయించుకుంటానన్న రోహిత్ 
  • కేసును సీబీఐకి అప్పగించడాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే 
ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు రాలేను.. 
ఈడీకి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లేఖ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరు కాకూడదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా వెల్లడించారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్యేను రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఈ రోజు(మంగళవారం) మరోసారి విచారణకు రావాలని పిలిచారు. అయితే, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించడాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తప్పుబట్టారు. సిట్ దర్యాఫ్తు   సజావుగా  సాగుతుండగా  కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

మరోపక్క, ఈ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై బుధవారం విచారణ జరగనుంది. దీనిపై కోర్టు తీర్పు వచ్చాకే విచారణకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకుంటానని రోహిత్ రెడ్డి అధికారులకు  సమాచారం ఇచ్చారు. మరోవైపు, ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పివ్వడంపై రోహిత్ రెడ్డి స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.



More Telugu News