ప్రపంచ కప్ కోసం భారత్ కు వెళ్లాలన్నది మా చేతుల్లో లేదు: పీసీబీ కొత్త చీఫ్

  • ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న నజమ్ సేతి
  • వెళ్లొద్దంటే ఆగిపోతామని వెల్లడి
  • తాము కేవలం స్పష్టత మాత్రమే తీసుకోగలమని స్పష్టీకరణ
ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ లో పర్యటిస్తుందా? లేదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్ కోసం పాకిస్థాన్ కు వచ్చేందుకు భారత్ నిరాకరిస్తే, తాము భారత్ లో జరిగే ప్రపంచ కప్ ను బహిష్కరిస్తామని లోగడ పీసీబీ చీఫ్ అయిన రమీజ్ రాజా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా.. ఉపఖండంలో జరిగే టోర్నమెంట్ కు భారత్ తన జట్టును పంపించబోదంటూ వ్యాఖ్యానించడం ఈ వివాదానికి కారణం. 

దీనిపై పీసీబీ చీఫ్ నజమ్ సేతి మాట్లాడుతూ.. ప్రపంచకప్ లో పాకిస్థాన్ పాల్గొనాలా? లేదా? అన్నది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని, పీసీబీపై కాదని చెప్పారు. ‘‘భారత్ కు వెళ్లొద్దని ప్రభుత్వం చెబితే అప్పుడు మేము వెళ్లేది లేదు. ఆడాలా, వద్దా, పర్యటనకు వెళ్లాలా, వద్దా ఈ నిర్ణయాలు ప్రభుత్వం స్థాయిలో తీసుకునేవి’’ అని కరాచీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా సేతి తెలిపారు. 

ఈ విషయంలో పీసీబీ కేవలం ప్రభుత్వం నుంచి స్పష్టత మాత్రమే తీసుకోగలదని చెప్పారు. ఆసియాకప్ కోసం భారత్ పాకిస్థాన్ కు వెళితే, 13 ఏళ్ల తర్వాత తొలి పర్యటన అవుతుంది. 2008 ఆసియాకప్ తర్వాత నుంచి భారత్-పాకిస్థాన్ జట్లు తలపడడం లేదు. అదే ఏడాది ముంబై ఉగ్రదాడులు జరగడం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు నిలిచిపోయాయి.


More Telugu News