అమెరికాలో ఇంకా కొనసాగుతున్న దారుణ పరిస్థితులు.. 60కి చేరిన మృతుల సంఖ్య

  • మంచు దుప్పటి కింద బఫెలో
  • మంచులో చిక్కుకుపోయిన కార్లలో బయటపడుతున్న మృతదేహాలు
  • అమెరికా వ్యాప్తంగా 15 వేల విమానాల రద్దు
అమెరికాలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. మంచు తుపాను దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 60కి పెరిగింది. భీకరంగా విరుచుకుపడుతున్న ఈ తుపానును ‘ఈ శతాబ్దపు మంచుతుపాను’గా అధికారులు అభివర్ణిస్తున్నారు. తుపాను కారణంగా ఒక్క న్యూయార్క్‌లోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 60 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మంచుతో పూర్తిగా కప్పుకుపోయిన బఫెలోలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ మంచును తవ్వి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. 

రోడ్లన్నీ కార్లు, బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులతో నిండిపోయాయి. వీధులన్నీ మంచులతో నిండిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు, వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఒంటరిగా ఉండేవారికి వైద్య పరమైన సాయం అందించడం కష్టంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు హై లిఫ్ట్ ట్రాక్టర్లను మోహరించారు. 

 బఫెలోలో మంచులో కూరుకుపోయిన వాహనాల్లో మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కార్లు, ఇతర వాహనాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారా? అన్నది తెలుసుకునేందుకు అత్యవసర బృందాలు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత నిన్న కొన్ని ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరుచుకున్నాయి. వాటి వద్దకు వెళ్లేందుకు ప్రజలు దాదాపు మూడు కిలోమీటర్ల పాటు మంచులో నడిచి వెళ్లాల్సి వస్తోంది. మంగళవారం వరకు పశ్చిమ న్యూయార్క్‌లో 23 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో అమెరికా వ్యాప్తంగా 15 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి.


More Telugu News