ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి బదిలీ... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

  • సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
  • సిట్ దర్యాప్తుకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం
  • పిటిషన్లు దాఖలు చేసిన నిందితులు, బీజేపీ నేతలు
  • నేడు హైకోర్టులో విచారణ.. తీర్పు  
సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును ఇప్పటిదాకా సిట్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ నిందితులతో పాటు, బీజేపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

విచారణ సందర్భంగా సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ దశలో కేసును సీబీఐకి బదిలీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో సిట్ పురోగతి సాధించిందని, అందుకే సిట్ తోనే దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

బీజేపీ నేతల తరఫున రాంచందర్ రావు వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తులో సాంకేతిక అంశాలను విస్మరించారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసు పెట్టారని, కేసుతో సంబంధంలేకపోయినా బీజేపీ పేరు ప్రస్తావించారని ఆయన కోర్టుకు విన్నవించారు. ఏకంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారని వివరించారు. అసలు ఈ కేసులో ఏసీబీకి తప్ప సిట్ కు విచారణ జరిపే అధికారంలేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. 

వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ వాదనలను తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిట్ ఏమేరకు దర్యాప్తు చేసిందో, ఆ వివరాలన్నీ సీబీఐకి అందజేయాలని ఆదేశించింది.


More Telugu News