ఏ కూరగాయ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది?
- అన్నింటినీ తీసుకెళ్లి రిఫ్రిజిరేటర్ లో పెట్టేయడం సరికాదు
- టమాటాలను గది ఉష్ణోగ్రతలోనే వారం వరకు ఉంచుకోవచ్చు
- ఆకు కూరలను ఫ్రిజ్ లో ఉంచి ఐదు రోజుల్లోపు వినియోగించాలి
ఏ రోజు కారోజు తాజా కూరగాయలను కొనుగోలు చేసి తినడం అంత ఉత్తమమైనది మరొకటి లేదు. దీనివల్ల వాటిల్లోని పోషకాలు నష్టపోకుండా ఉంటాయి. వాటిని తిన్నప్పుడు మనకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. కూరగాయల్లోని పోషకాలు కొన్ని రోజుల తర్వాత నశిస్తాయన్నది. కనుక తాజా కూరగాయలను వాడుకోవడం మంచి విధానం. ఎన్ని రోజుల పాటు ఎలా ఉంచితే నిల్వ ఉంటాయో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వినియోగించుకోవడం మెరుగైనది.
- దెబ్బతిన్న కూరగాయలు లేదా పండ్లను కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొన్ని కూరగాయలను నేరుగా ఫ్రీజర్ లో పెట్టేయవచ్చు. కానీ, కొన్నింటిని పెట్టకూడదు.
- టమాటాలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. పండిన తర్వాత టమాటాలు వారం పాటు గది ఉష్ణోగ్రతలో చెడిపోకుండా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అనవసరం. ఎందుకంటే బయటే ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల రుచిపోతుంది.
- బ్రొకోలీ, క్యాలిఫ్లవర్ మూడు నుంచి ఐదు రోజలు వరకు రిఫ్రిజిరేటర్ లో ఉంటాయి.
- పాలకూర, ఇతర ఆకు కూరలను రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు. కొన్ని 3-5 రోజుల వరకు, మరికొన్ని వారం వరకు పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. కనుక ఆకు కూరలను 5 రోజుల్లోపు వినియోగించుకోవాలి.
- వేరుజాతికి చెందిన క్యారట్ రిఫ్రిజిరేటర్ లో మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.
- ముల్లంగి అయితే ఫ్రిజ్ లో రెండు వారాలు తాజాగా ఉంటుంది.
- బంగాళాదుంప, చిలగడదుంపను రిఫ్రిజిరేటర్ లో పెట్టొద్దు. వాటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచేయాలి. వారం రోజుల వరకు వీటిలోని పోషకాలు మిగిలే ఉంటాయి.
- ఉల్లి, వెల్లుల్లి విషయానికొస్తే.. వీటిని ఫ్రిజ్ లో, బయట కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మిగిలిన కూరగాయలు, పండ్లకు వీటిని దూరంగా పెట్టాలి. వెల్లుల్లి ఫ్రిజ్ లో చాలా వారాలు నిల్వ ఉంటుంది. ఉల్లి సైతం రెండు నెలలు తాజాగా ఉంటుంది.
- 10 రోజుల పాటు రిఫ్రిజిరేటర్ లో మష్ రూమ్ తాజాగా ఉంటుంది.
- బీన్స్, చిక్కుడు ఐదు రోజుల వరకు రిఫ్రిజిరేటర్ లో తాజాగా ఉంటాయి.