ఒక్క ఆటగాడికే కోట్లు కుమ్మరిస్తే ఐపీఎల్ లో విజయం వరిస్తుందా..?

  • భారీ ధర పెట్టి కొన్నా ఒంటి చేత్తో గెలిపించిన ధాఖలాలు లేవు
  • 2013లో మాత్రం మ్యాక్స్ వెల్ ను కొన్న ముంబైకి కప్పు
  • జట్టు సమతూకమే గెలుపు తీరాలకు చేరుస్తుందన్నది నిజం
ఒక్క ఆటగాడికే రూ.16 కోట్లకు పైగా కుమ్మరించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తి చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మినీ వేలంలో సామ్ కరన్, కామెరాన్ గ్రీన్, బెన్ స్టోక్స్ రూ.16 కోట్లకు పైనే పలికారు. ఒక ఆటగాడికి ఈ స్థాయిలో ఖర్చు చేసేందుకు ఫ్రాంచైజీలు ఎందుకంత ఆరాటపడుతున్నాయి? అనే ప్రశ్న సగటు క్రీడాభిమానికి ఎదురవుతోంది. ఇదంతా ఐపీఎల్ లో సత్తా చాటాలని, కప్పు కొట్టాలనే ఆరాటం వల్లేనన్నది వాస్తవం. మరి అంత భారీ ధరకు కొన్న వారి వల్ల ఫ్రాంచైజీలకు ఆయా సంవత్సరాల్లో విజయాలు వరించాయా? అంటే నో అనే సమాధానమే వస్తోంది.

ఒక ఆటగాడు ఒంటి చేత్తో ఒకటి రెండు మ్యాచ్ లను గెలిపించగలడు. కానీ, మొత్తం సీజన్ లో అదే ప్రదర్శనతో కప్పు తెచ్చి పెట్టడం అసాధ్యం. మెరికలు తిరిగిన ఆటగాళ్లు, బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల సమన్వయం, సమతూకంతో కూడిన జట్లే రాణిస్తాయనేది వాస్తవం. ఒక్క 2013 సంవత్సరాన్ని మినహాయిస్తే, మరే సంవత్సరంలోనూ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడి వల్ల ఆయా ఫ్రాంచైజీలు కప్పు కొట్టలేదు. 2013లో ముంబై జట్టు గ్లెన్ మ్యాక్స్ వెల్ ను మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం కలిసొచ్చింది.

  • 2008లో మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధర పెట్టి (1.5 మిలియన్ డాలర్లు) కొంది. రన్నరప్ గా నిలిచింది.
  • 2009లో ఆండ్య్రూ ఫ్లింటాఫ్, కెవిన్ పీటర్సన్ ధోనీ కంటే అధికంగా, ఒక్కొక్కరు 1.55 మిలియన్ డాలర్ల ధరకు అమ్ముడయ్యారు. ఫ్లింటాఫ్ ను సీఎస్కే కొనుగోలు చేయగా సెమీస్ లో ఓడిపోయింది. పీటర్సన్ ను తీసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రన్నరప్ గా నిలిచింది. 
  • 2010లో షేన్ బాండ్, కీరన్ పోలార్డ్ అధిక ధర పలికారు. షేన్ బాండ్ ను కొనుగోలు చేసిన కోల్ కతా జట్టు 6వ స్థానంతో సరిపెట్టుకుంది. పోలార్డ్ ను కొన్న ముంబై జట్టు రన్నరప్ గా నిలిచింది. 
  • 2011లో 2.4 మిలియన్ డాలర్లకు గౌతం గంభీర్ ను కొనుగోలు చేసిన కోల్ కతా జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. 
  • 2012లో రవీంద్ర జడేజాను సీఎస్కే 2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా, రన్నరప్ గా నిలిచింది.
  • 2013లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ను భారీ ధరకు కొన్న ముంబై ఛాంపియన్ గా నిలిచింది.
  • 2014 నుంచి వేలాన్ని రూపాయిల్లో నిర్వహించడం మొదలు పెట్టారు. యువరాజ్ సింగ్ ను వరుసగా 2014, 2015లో అధిక ధరకు బెంగళూరు, ఢిల్లీ జట్లు కొనుగోలు చేశాయి. ఏడో స్థానంలో సరిపెట్టుకున్నాయి.


More Telugu News