చర్చలకు సిద్ధమంటూనే క్షిపణుల వర్షం కురిపిస్తున్న రష్యా
- చర్చల ద్వారా యుద్ధం ముగింపు సాధ్యమేనని నిన్న వ్యాఖ్యానించిన పుతిన్
- పుతిన్ వ్యాఖ్యల తర్వాత కూడా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యా
- దాదాపు 45 పట్టణాలపై దాడి చేసిన రష్యన్ బలగాలు
ఉక్రెయిన్ తో యుద్ధం ముగిసే అవకాశం ఉందని, శాంతియుత చర్చల ద్వారా అది సాధ్యమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పుతిన్ వ్యాఖ్యలతో యుద్ధం ఆగినట్టేనని పలువురు భావించారు. అయితే, పుతిన్ స్పందన తర్వాత కూడా ఉక్రెయిన్ పై రష్యా బలగాలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. ఖార్కీవ్ రీజన్ లోని పలు పట్టణాలపై రాకెట్లు, క్షిపణులతో రష్యా దాడి చేస్తోంది. ఖార్కీవ్ రీజియన్ లోని 25 పట్టణాలు, జపోరిజియాయ రీజియన్ లోని 20 టౌన్లపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. తాజా దాడులతో పుతిన్ వ్యాఖ్యలకు, చేతలకు పొంతన లేదనే విషయం తేలిపోయింది.