వరుసకు అన్నా చెల్లెళ్లు అయిన వారి మధ్య ప్రేమ.. వారించినందుకు ఆత్మహత్య

  • నారాయణపేట జిల్లాలో ఘటన
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి 70 కుటుంబాల వలస
  • ఆ కుటుంబాల్లోని ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ
  • తగదన్నందుకు రైలు కింద పడి ఆత్మహత్య
వరుసకు అన్నాచెల్లెళ్లు అయిన వారి మధ్య చిగురించిన ప్రేమ పెరిగి పెద్దదైంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. విషయం తెలిసిన పెద్దలు.. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమేంటని మందలించారు. దీంతో తాము ఇక కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఆ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని చేగుంట-కృష్ణ రైల్వే స్టేషన్ల మధ్య జరిగిందీ ఘటన. 

ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని దనాల, పర్లాపల్లి గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు పత్తి చేలలో పనిచేసేందుకు చేగుంటకు వలస వచ్చాయి. అక్కడే తాత్కాలిక గుడారాలు వేసుకుని పనులకు వెళ్లి వస్తున్నారు.

వీరిలో ఈరమ్మ-మున్నెల్ల దంపతుల కుమారుడు మణికుమార్ (25), శాంతమ్మ-కేశవల కుమార్తె అనిత (15) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిని వారించారు. వరుసకు ఇద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారని, కాబట్టి ఇది తగదని మందలించారు. అయితే, అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిన వారు ఒకరినొకరు విడిచి ఉండడం సాధ్యం కాదని, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ కలిసి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అనంతరం అనిత పట్టాల మధ్య తన చున్నీ పరిచింది. ఇద్దరూ దానిపై ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పడుకున్నారు. కాసేపటికి ఓ రైలు వారి పైనుంచి వెళ్లడంతో మృతి చెందారు. ఉదయం పనులకు వెళ్తున్న వారు ఈ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News