చలికి వణుకుతున్న ఉత్తర భారతదేశం.. ఢిల్లీలో 5.3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

  • ఢిల్లీలో నిన్న కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత
  • గడ్డకట్టుకుపోతున్న కశ్మీరం
  • శ్రీనగర్‌లో మైనస్ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత
దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉత్తర భారతదేశం చలికి వణుకుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలను పొగమంచు కమ్మేస్తోంది. కశ్మీర్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీలో సగటు కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 5.3, 16.2 డిగ్రీలు ఉండగా, నిన్న కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీలు నమోదైంది. పలు ప్రాంతాల్లో నేడు కూడా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని, శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

కశ్మీర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు చలికి గడ్డకట్టుకుపోతున్నారు. దాల్ సరస్సు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకుపోయింది. ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ స్తంభించింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర భారతదేశంలో మరో రెండురోజులపాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని, దట్టమైన మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


More Telugu News