అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు: యనమల రామకృష్ణుడు

  • కాగ్ వంటి సంస్థలకు కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారన్న యనమల
  • దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన సీఎంగా జగన్ నిలిచిపోతారని విమర్శ
  • 175 సీట్లు వస్తాయని జగన్ కలలు కంటున్నారని ఎద్దేవా
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అప్పులపై ముఖ్యమంత్రి జగన్, మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రితో బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. 25 ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్న అనుభవాన్ని బాధ్యతవున్న వ్యక్తిగా చెబుతుంటే పదే పదే తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారని... ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడంలేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

గతంలో కన్నా తక్కువ అప్పులు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి మరోసారి అబద్ధ ప్రచారానికి తెరలేపారని విమర్శించారు. దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, సంక్షేమం కన్నా అప్పులు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. స్వాతంత్యం వచ్చిన తరువాత అప్పుడున్న ప్రభుత్వాలు 1956 నుంచి 2019 వరకు చేసిన అప్పులు రూ. 2 లక్షల 53 వేల కోట్లు ఉండగా  వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే రూ.6 లక్షల 38వేల కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో చేసిన మొత్తం అప్పు 5 సంవత్సరాలలో రూ.1,63,981 కోట్లు... అనగా సంవత్సరానికి సరాసరి చేసిన అప్పు రూ. 32,800 కోట్లని.... వైసీపీ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన అప్పు రూ. 1లక్షా 32వేల కోట్లు ఉంది. 

తెదేపా హయాంలోని 4 శాతం ద్రవ్య లోటు నుండి 9.6 శాతంకు పెరగడం జగన్ రెడ్డి ఘనత అని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో లంచాలు తగ్గాయని ముఖ్యమంత్రి చెప్పటం పెద్ద జోక్ గా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఇకమీదట అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దని ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 175 సీట్లు వస్తాయంటూ ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారని... 2024 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కు పడిపోవడం ఖాయమని చెప్పారు.


More Telugu News