రేపు హైదరాబాద్ కు వస్తున్న రాష్ట్రపతి.. టూర్ షెడ్యూల్ ఇదే

  • రాష్ట్రపతి హోదాలో తొలిసారి తెలంగాణకు ద్రౌపది ముర్ము
  • ఈ నెల 30వ తేదీ వరకు శీతాకాల విడిది కోసం రాక
  • శ్రీశైలం, భద్రాచలం దర్శనాలకు వెళ్లనున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్ కు వస్తున్నారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము 30వ తేదీ వరకు బస చేస్తారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో, సమీప ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో 6 భవనాలు, వెలుపల ఉన్న 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలను, ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రాష్ట్రపతి నిలయం పరిసరాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తులు వేసవి కాలంలో సిమ్లాకు, శీతాకాలంలో హైదరాబాద్ పర్యటనకు రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ లో శీతాకాల విడిదికి రాలేదు. 

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గత వారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ముర్ము హాజరయ్యే కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను కోరారు. కాగా, సోమవారం హైదరాబాద్‌లో దిగిన వెంటనే, ముర్ము రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు బస చేసిన తర్వాత, శ్రీశైలానికి చేరుకుంటారు. అక్కడ మల్లికార్జున స్వామి, భ్రమ రాంబిక ఆలయాలను దర్శిస్తారు.

ఈ నెల 28న రాష్ట్రపతి ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. దీన్ని గత సంవత్సరం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అదే రోజు ఆమె భద్రాచలం ఆలయాన్ని సందర్శించి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే, హైదరాబాద్‌లో కన్హా శాంతి వనంలో శ్రీరామచంద్ర మిషన్ ద్వారా ఫతేపూర్‌కు చెందిన శ్రీరామచంద్రాజీ మహారాజ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హర్ దిల్ ధ్యాన్ ఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో కూడా ముర్ము పాల్గొంటారు.


More Telugu News