అవుటైన తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లపై కోపంతో విరుచుకుపడిన కోహ్లీ.. వీడియో ఇదిగో!

  • బంగ్లాదేశ్‌తో ఢాకాలో రెండో టెస్టు
  • రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్
  • బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో విఫలమైన కోహ్లీ
  • మైదానాన్ని వీడుతున్న సమయంలో కోహ్లీకి కోపం తెప్పించిన బంగ్లా ప్లేయర్
  • దగ్గరికెళ్లి సమాధానమిచ్చిన కోహ్లీ.. వారించిన అంపైర్లు 
బంగ్లాదేశ్‌తో ఢాకాలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు రసకందాయంలో పడింది. ఆతిథ్య బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి బాధాకరమైన రోజుగా మిగిలిపోయింది. ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు జారవిడిచిన కోహ్లీ.. బ్యాట్‌తోనూ రాణించలేకపోయాడు. 22 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి మెహిదీ హసన్ బౌలింగులో పెవిలియన్ చేరాడు.  

క్రీజులో ఉన్నంత సేపు కోహ్లీ అసౌకర్యంగా కదిలాడు. తొలి నుంచి డిఫెన్సివ్ మోడ్‌లోనే ఉన్న కోహ్లీ చివరికి షార్ట్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇండియా బిగ్ వికెట్ కోల్పోవడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఎగిరి గంతులేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానాన్ని వీడుతున్న కోహ్లీని ఉద్దేశించి ఏదో అన్నారు. 

అంతే.. కోహ్లీలో కోపం నషాళానికి అంటింది. కోపంగా వారి వద్దకు వెళ్లిన కోహ్లీ వారికి బదులిచ్చాడు. గమనించిన అంపైర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ కూడా వెంటనే ఆటగాళ్ల వద్దకు వచ్చి పరిస్థితిని అదుపు చేశాడు. అంపైర్లు సర్ది చెప్పడంతో కోహ్లీ వెళ్లిపోయాడు. అయితే, కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించిన బంగ్లా ప్లేయర్ ఎవరన్నది తెలియరాలేదు.


More Telugu News