స్వార్థపరులను కూడా ఏసు క్షమించగలిగాడు: చంద్రబాబు

  • సమాజం కోసం ఏసు తన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తి  అన్న చంద్రబాబు
  • జీసస్ తన జీవితం ద్వారా సన్మార్గానికి బాటలు వేశారన్న అచ్చెన్నాయుడు
  • మానవాళి శాంతికి శాంతి ముఖ్యమని చెప్పారన్న బాలకృష్ణ
క్రీస్తు ఆరాధకులకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ఏసు ఈ ప్రపంచానికి అందించారని అన్నారు. ప్రేమ అన్నది మానవ లక్షణమని, సాటి మనిషి పట్ల ప్రేమను, కనికరాన్ని కలిగి ఉండాలని క్రీస్తు మనకు బోధించారన్నారు. లోకానికి నిస్వార్థ సేవా మార్గాన్ని సూచించారని కొనియాడారు. తనకు కీడు తలపెట్టినా స్వార్థపరులను సైతం క్షమించగలిగాడు కాబట్టే ప్రజలు ఆయనను దైవ కుమారుడిగా భావించి ప్రార్థిస్తున్నారని అన్నారు. సమాజం కోసం జీవితాన్ని, చివరికి ప్రాణాలను సైతం అర్పించిన త్యాగమూర్తి అని అన్నారు. ఆయన మార్గం అందరికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కరుణామయుడైన ఏసు దీవెనలు అందరికీ లభించాలని, ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని, ప్రశాంతతను పంచాలని చంద్రబాబు అభిలషించారు. 

సన్మార్గానికి బాటలు వేశారు: అచ్చెన్నాయుడు 
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ తన జీవితం ద్వారా సన్మార్గానికి బాటలు వేశారని అన్నారు. ఆయన బోధనలు ఆచరణీయమని అన్నారు. ఈ క్రిస్మస్ అందరిలోనూ సంతోషం నింపాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

ఏసు క్రీస్తు ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మానవులలో ప్రేమ, కరుణ, శాంతి వెల్లివిరియాలని, ఆ గుణాలు ఉన్నప్పుడే మనిషి పరిశుద్ధుడు అవుతాడని క్రీస్తు బోధించారని తెలిపారు. మానవాళి అభివృద్ధికి శాంతి ఎంతో ముఖ్యమని చెప్పారని, అందుకనే ఆయనను ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ అంటారని బాలకృష్ణ పేర్కొన్నారు.


More Telugu News