'ఫాల్' వెబ్ సిరీస్: జీవా గురించి దివ్యకి తెలిసే నిజం ఏమిటి?

  • అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన 'ఫాల్'
  • ఏడు ఎపిసోడ్స్ గా నడిచిన ఫస్టు సీజన్ 
  • మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా నడిచిన డ్రామా 
  • ఈ వెబ్ సిరీస్ కి స్క్రీన్ ప్లే హైలైట్ 
  • అంజలి నుంచి వచ్చిన మరో మంచి వెబ్ సిరీస్ ఇది
ఇంతవరకూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు 'ఫాల్' వెబ్ సిరీస్ నుంచి 5 ఎపిసోడ్స్ ను వదిలారు. నిన్న మరో రెండు ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేశారు. కోమాలో నుంచి బయటపడిన దివ్య (అంజలి) తనని మేడపై నుంచి తోసేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో పడుతుంది. తన సొంత అన్న అయిన రోహిత్ పై ఆమెకు అనుమానం కలుగుతుంది. దాంతో రోహిత్ భార్య మలార్ కూడా తన భర్త పాత్ర పట్ల ఓ కన్నేసి ఉంచుతుంది. దివ్యను మేడపై నుంచి తోసేసింది కృతిక కావొచ్చునని డేనియల్ అనుకుంటాడు.

ఇలాంటి పరిస్థితుల్లోనే దివ్య వాడే ఒక మెడిసిన్ ను దొంగచాటుగా ఎవరో మారుస్తారు. ఆ మెడిసిన్ వాడిన ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది. ఈ విషయంలో కూడా అందరి అనుమానం రోహిత్ పైకి వెళుతుంది. అతని అనుమానం మాత్రం కృతికపై ఉంటుంది. ఈ సందర్భంలోనే దివ్యతో పాటు ఆమె స్పోర్ట్ సెంటర్ లో పనిచేసే 'జీవా'ను ఆమెకి దూరంగా లండన్ పంపించేయాలని దివ్య తల్లి నిర్ణయించుకుంటుంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లను చకచకా పూర్తిచేయిస్తుంది.

ఒక స్పోర్ట్స్ సెంటర్ లో పనిచేసే కుర్రాడిని లండన్ లోని కాలేజ్ లో చేర్పించడం .. అందుకు పెద్ద మొత్తంలో దివ్య తల్లి ఫీజ్ కట్టడం ఇన్ స్పెక్టర్ కుమరన్ కి తెలుస్తుంది. ఈ విషయంపై అతను దివ్య తల్లిని కలుసుకుంటాడు. దివ్య కేసులో అనుమానితుడైన జీవాను ఫారిన్ ఎలా పంపిస్తారని ఆమెను నిలదీస్తాడు. అప్పుడు ఆమె ఏం చెబుతుంది? జీవా గురించిన ఎలాంటి నిజం దివ్యకి తెలుస్తుంది? ఈ కథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ రెండు ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి.

మొదటి నుంచి చివరివరకూ దివ్య - జీవా పాత్రలను నడిపిస్తూ వచ్చిన తీరును బట్టి చూస్తే, ముగింపు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ కథకు ఈ ముగింపే సరైనదని మేకర్స్ భావిస్తే, అప్పటివరకూ నడిపిస్తూ వచ్చిన డ్రామా మాత్రం ఆసక్తికరంగానే ఉంటుంది. ఏ పాత్రను ఏ ఎపిసోడ్ లోను వదిలేయకుండా ఆడియన్స్ కు కనెక్ట్ చేస్తూ వెళ్లిన స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ అనుకోవాలి. ప్రతి పాత్రకు ఒక ముగింపు పలికిన తీరు పెర్ఫెక్ట్ గా ఉంది. అంజలి చేసిన మరో మంచి వెబ్ సిరీస్ గా ఇది మార్కులు కొట్టేస్తుందని చెప్పచ్చు.


More Telugu News