ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి: చంద్రబాబు

  • విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • అమరావతిలో రూ.3 లక్షల కోట్లు ఆవిరైనట్టు వెల్లడి
  • రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని వివరణ
విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మారాలని అభిలషించారు. 

అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని వివరించారు. జీతాలు ఇవ్వలేని సీఎం మూడు రాజధానులు కడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసగించారని మండిపడ్డారు. 

వైసీపీ పాలనలో రైతులు ఆనందంగా లేరని వ్యాఖ్యానించారు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని, రాష్ట్రంలో రైతులు పూర్తిగా చితికిపోయారని తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని వివరించారు. 

తాము గతంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచామని, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. నాయకత్వం కోసం మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు.


More Telugu News