తాలిబన్ల నిర్ణయంతో యూనివర్సిటీ విద్యకు మహిళల దూరం.. క్లాస్‌రూములో ఎలా రోదిస్తున్నారో చూడండి!

  • గుండెలు పిండేస్తున్న వీడియో
  • తాలిబన్ల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు
  • ఆందోళన వ్యక్తం చేసిన భారత్
మహిళలను యూనివర్సిటీ విద్యకు దూరం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమ్మాయిలు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తుకు భరోసా కరవైందన్న బాధతో పొగిలిపొగిలి ఏడుస్తున్నారు. తాలిబన్ల నిర్ణయం తెలిసి అమ్మాయిలు తరగతి గదిలో ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి రోదన అందరినీ కదిలిస్తోంది. ఈ నెల 21న ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ వీడియో 23 సెకన్ల నిడివి ఉంది. తరగతి గది నిండా ఉన్న అమ్మాయిలు తాలిబన్ల నిర్ణయంతో ఒక్కసారిగా రోదించారు. 

గత బుధవారం తాలిబన్ ఉన్నత విద్యాశాఖ ఓ ప్రకటన చేస్తూ యూనివర్సిటీ విద్య నుంచి మహిళలను నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు అన్నింటికీ వర్తిస్తుందని, ఇకపై ఎవరూ మహిళలను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. తాలిబన్లు ఆ ప్రకటన చేసిన వెంటనే అన్ని యూనివర్సిటీల వద్దకు తాలిబన్ సాయుధ బలగాలు మహిళలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాయి.  

యూనివర్సిటీ విద్యకు మహిళలను దూరం చేస్తూ ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా విద్యకు భారత్ స్థిరంగా మద్దతు ఇస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ అందరినీ కలుపుకుని పోవాలని తాలిబన్ ప్రభుత్వానికి భారత్ సూచించింది.


More Telugu News