బాదుడుకు సిద్ధమైన టెలికం కంపెనీలు.. టారిఫ్‌లు 10 శాతం పెంచేందుకు రంగం సిద్ధం!

  • పెరుగుతున్న భారాన్ని తగ్గించుకునే యత్నం
  • పడిపోతున్న ఏఆర్‌పీయూ
  • వరుసగా మూడేళ్ల పాటు పెంచనున్న జియో, ఎయిర్‌టెల్
  • వెల్లడించిన ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్
చందాదారులను బాదేందుకు టెలికం కంపెనీలు సిద్ధమయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 శాతం టారిఫ్‌లు పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ తెలిపింది. మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ, నంబర్ పోర్టబిలిటీ, 5జీ సేవలు కారణంగా టెలికం సంస్థలపై భారం పెరుగుతోంది. ఫలితంగా టారిఫ్ పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని జెఫెరీస్ అభిప్రాయపడింది. ఎయిర్‌టెల్, జియో సంస్థలు 2023, 2024, 2025 ఆర్థిక సంవత్సరాల చివరి త్రైమాసికంలో టారిఫ్‌లు పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. రాబడి తగ్గడం, పెట్టుబడుల వ్యయం పెరగడం, వినియోగదారుడిపై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) తగ్గడం వంటివి టారిఫ్‌లు పెంపునకు కారణమని టెలికం నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం జియో 0.8 శాతం, వొడాఫోన్ ఐడియా ఒక శాతం, ఎయిర్‌టెల్ 4 శాతం ఏఆర్‌పీయూను పెంచాయి.

గత నెలలో ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ 57 శాతం పెంచింది. గతంలో దాని బేసిక్ ప్లాన్ ధర రూ. 99గా ఉండేది. ఈ ప్లాన్‌లో 28 రోజుల కాలపరిమితితో 200 ఎంబీ డేటా లభించేది. కాల్‌కు సెకనుకు రూ. 2.5 పైసలు వసూలు చేసేది. గత నెలలో దీనిని 57 శాతం పెంచి రూ. 155 చేసింది. ఈ ప్లాన్‌లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా, వింక్ మ్యూజిక్ యాప్ యాక్సెస్, 300 ఉచిత ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. అయితే, ఇది హర్యానా, ఒడిశా సర్కిళ్లలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

కాగా, సెప్టెంబరు నాటి సబ్‌స్క్రైబర్ల లెక్కలను ‘ట్రాయ్’ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం ఆ నెలలో జియోకు 7.2 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు చేరారు. ఎయిర్‌టెల్‌ కొత్తగా 4.12 లక్షల మంది చందాదారులను చేర్చుకోగా, వొడాఫోన్ ఐడియా మాత్రం 40 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. జియో, ఎయిర్‌టెల్ సంస్థలు 5జీని ప్రారంభించడంతో వినియోగదారులు అటువైపు మొగ్గుతున్నారు.


More Telugu News