ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఇంటికే!: పొందూరు రోడ్ షోలో చంద్రబాబు

  • విజయనగరం జిల్లాకు వెళుతున్న చంద్రబాబు
  • మార్గమధ్యంలో పొందూరు వద్ద రోడ్ షో
  • రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శలు
  • ఉత్తారంధ్రపై జగన్ ది సవతి తల్లి ప్రేమ అని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో శ్రీకాకుళం జిల్లా పొందూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని, ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఇంటికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఉత్తరాంధ్ర మీద జగన్ ది సవతి తల్లి ప్రేమ అని విమర్శించారు. మూడున్నరేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేశాడా? ఉత్తరాంధ్ర ప్రజలపై ఏమైనా అభిమానం చూపించాడా? అని ప్రశ్నించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేశాడా? ఒక ఇండస్ట్రీ తెచ్చాడా? ఒక కాలేజీ తెచ్చాడా? అని నిలదీశారు. 

ఈ రోడ్ షోకు వచ్చిన ప్రజల ఆవేశం చూస్తుంటే రాత్రికి పొందూరులోనే ఉండిపోవాలనిపిస్తోందని అన్నారు. పొందూరు ఖద్దరుకు ఎంతో ఫేమస్ అని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచి పొందూరు ఖద్దరు గురించి వింటూనే ఉన్నానని చంద్రబాబు తెలిపారు. చేనేత కార్మికులకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని, ఇకపైనా అండగా ఉంటామని తెలిపారు.

ప్రజలు తమ సమస్యలు చెబుతుంటే తనపై మరింత బాధ్యత పెరిగిందన్న విషయం అర్థం చేసుకున్నానని వివరించారు. ఈ సందర్భంగా... "జాబు రావాలంటే... బాబు రావాలి, రైతుల ఆత్మహ్యతలు ఆగాలంటే... బాబు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే... బాబు రావాలి" అంటూ రోడ్ షోకు వచ్చిన వారితో చంద్రబాబు నినాదాలు చేయించారు. వారు ఉత్సాహంగా నినాదాలు చేసిన అనంతరం ఆయన స్పందిస్తూ, "అన్నీ బాగానే చెబుతున్నారు తమ్ముళ్లూ... యాక్షన్ లోనే కనిపించడంలేదు" అంటూ చిరు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇక మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.... ఏవమ్మా మహిళలూ, డ్వాక్రా సంఘాలు తెచ్చింది నేనే. వంటింట్లో ఉన్న మహిళలను బయటికి తీసుకువచ్చి మగవారితో సమానంగా నిలిపేందుకు కార్యాచరణ తయారుచేసింది కూడా మేమే అని వివరించారు. మహిళలకు కూడా ఆస్తిలో సమానహక్కు ఇచ్చింది టీడీపీయేనని అన్నారు. 

ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసులకు భయపడేదేలేదని అన్నారు. అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టారు... ఏం పీకారని ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేం తలుచుకుని ఉంటే నువ్వు బయటికి వచ్చేవాడివా అని వ్యాఖ్యానించారు.


More Telugu News