బంగ్లాను 227 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా

  • ఢాకాలో భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
  • రోజంతా కూడా ఆడలేకపోయిన ఆతిథ్యజట్టు
  • ఉమేశ్ యాదవ్, అశ్విన్ కు చెరో 4 వికెట్లు
టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కట్ సత్తా చాటడంతో బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించాలని భావించినా, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో తొలి రోజు సాయంత్రానికే ఇన్నింగ్స్ ముగించింది. 

టీమిండియా సీనియర్ పేసర్ ఉమేవ్ యాదవ్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, అశ్విన్ 71 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ సీమర్ జయదేవ్ ఉనద్కట్ 2 వికెట్లు తీసి తన ఎంపికకు న్యాయం చేశాడు. సిరాజ్, అక్షర్ పటేల్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో మోమినుల్ హక్ 84 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముష్ఫికర్ రహీమ్ 26, లిట్టన్ దాస్ 25, నజ్ముల్ హుస్సేన్ శాంటో 24, కెప్టెన్ షకీబల్ హసన్ 16 పరుగులు చేశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 3, శుభ్ మాన్ గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.


More Telugu News