ఎవరి సేఫ్ గేమ్ వారు ఆడారు: 'బిగ్ బాస్' విన్నర్ రేవంత్

  • బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రేవంత్ 
  • తాజా ఇంటర్వ్యూలో తన గేమ్ గురించిన ప్రస్తావన 
  • మంచి అనిపించుకోవడానికి ట్రై చేయలేదని వ్యాఖ్య 
  • తన మాటతీరు కొంతమందిని మార్చిందని వెల్లడి
బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ నిలిచాడు. హౌస్ లో ఆవేశపరుడిగా పేరు తెచ్చుకుని .. ప్రతి గేమ్ లోను దూకుడుగా ముందుకెళ్లిన రేవంత్ .. మొత్తానికి విజేతగా నిలిచాడు. తాజాగా 'బీబీ కేఫ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "బిగ్ బాస్ వలన నాకు పేరు వచ్చింది. పేరు వస్తే డబ్బు అదే వస్తుంది. కేవలం డబ్బు మాత్రమే అయితే, అది కరిగిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు" అన్నాడు. 

"గెలిస్తే పేరు వస్తుంది .. పేరుతో పాటు డబ్బు వస్తుంది .. ఈ రెండూ మా భవిష్యత్తుకు ఎంతో అవసరం. అందువల్లనే, మా ఆవిడ వెంటే ఉండవలసిన అత్యవసర పరిస్థితుల్లో కూడా నేను ఈ హౌస్ లో ఉండిపోయాను. నేను బయట ఎలా ఉన్నానో హౌస్ లో కూడా అలాగే ఉన్నాను. మంచి అనిపించుకోవడం కోసం .. జనాల కోసం మారడానికి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు" అని చెప్పాడు.

"హౌస్ లో నాతో పాటు ఉన్నవాళ్లంతా ఏమైనా అనుకుంటారేమోనని నేను భయపడను .. ధైర్యంగా చెబుతున్నాను .. ఎవరి సేఫ్ గేమ్ వారు ఆడారు.  హౌస్ లోని చాలామందికి ఆయా సందర్భాల్లో ధైర్యం చెప్పాను .. కొన్ని సందర్భాల్లో ఓదార్చాను. కొంతమంది మాత్రం తమ పద్ధతిని మార్చుకున్నారు. ఇంకొంతమంది నాలోని నెగెటివ్ పాయింట్స్ నే చెబుతూ వచ్చారు. ఎవరెన్ని అన్నప్పటికీ జనాలకి నా ఆటతీరు నచ్చడం వలన, ఈ ట్రోఫీ నా చేతికి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News