ఒక్కరోజులో రూ.63 వేల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్

  • స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్లకు ఎదురుదెబ్బ
  • అమ్మకాల ఒత్తిడితో భారీగా పతనం
  • అక్టోబరు తర్వాత మరోసారి భారీగా నష్టపోయిన టెస్లా షేర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లో కలిసిరాలేదు. అమెరికా స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్లకు ఎదురుదెబ్బ తగిలిగింది. టెస్లా షేర్ల ధరలు అమ్మకాల ఒత్తిడితో పతనం కావడంతో ఎలాన్ మస్క్ భారీగా నష్టపోయారు. ఒక్కరోజే మస్క్ సంపదలో రూ.63.72 వేల కోట్లు తరిగిపోయాయి. అక్టోబరు తర్వాత టెస్లా షేర్లు ఈ స్థాయిలో కుదుపులకు గురికావడం ఇదే ప్రథమం. 

ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. ప్రథమస్థానంలో ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. మస్క్ సంపద 148 బిలియన్ డాలర్లు కాగా, ఆర్నాల్ట్ సంపాదన 161 బిలియన్ డాలర్లు. 

మస్క్ ఆస్తుల్లో అత్యధికం టెస్లా సంస్థలో స్టాక్స్/ఆప్షన్స్ రూపంలోనే ఉన్నాయి. ఇటీవల ఆయన ట్విట్టర్ ను హస్తగతం చేసుకోగా, అందుకు అవసరమైన నిధుల కోసం 3.58 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. కాగా, ట్విట్టర్ విషయంలో మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా టెస్లా షేర్లపై ప్రభావం చూపుతున్నట్టు ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.


More Telugu News