చైనాలో కరోనా విలయానికి ఈ వీడియోలే నిదర్శనం

  • రోగులతో ఆసుపత్రులు కిటకిట
  • ఐసీయూలో పడకలు చాలని పరిస్థితి
  • నేలపైన పడుకోబెట్టి చికిత్స చేయాల్సిన దుస్థితి
  • వైద్యం చేస్తూనే ప్రాణాలు విడుస్తున్న వైద్యులు
చైనాపై కరోనా కోరలు చాచి విరుచుకుపడుతోంది. జీరో కోవిడ్ పాలసీ (ఒక్క కేసు వచ్చినా ఆ ప్రాంతాన్ని అంతా కట్టడి చేసేయడం) పేరుతో ఇంత కాలం కరోనా వైరస్ విస్తరించకుండా సక్సెస్ అయిన చైనా.. ఇప్పుడు మాత్రం వైరస్ కు తల వంచే పరిస్థితిని ఎదుర్కొంటోంది. జీరో కోవిడ్ పాలసీతో ఉపాధి లేక, తిండికి, నీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు అక్కడి సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో జీరో కోవిడ్ పాలసీని చైనా సర్కారు ఇటీవలే ఎత్తేసింది. ఆ తర్వాత నుంచి కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. 

వాస్తవానికి ఇప్పుడు చైనాలో వైద్య వసతులు గణనీయంగానే ఉన్నాయి. అయినా ఆ దేశ జనాభా 140 కోట్లు. వచ్చే 90 రోజుల్లో అక్కడ మూడింట ఒక వంతు ఇన్ఫెక్షన్ బారిన పడతారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. ఓపక్క రోగులకు వైద్యం అందిస్తూనే, మరోపక్క కొందరు వైద్యులు కూడా ప్రాణాలు విడుస్తున్నారు.

చైనాలోని చాంకింగ్ పట్టణంలో ఓ ఆసుపత్రిలో అయితే ఐసీయూ పడకలు నిండిపోవడంతో, రోగులను నేలపై పడుకోబెట్టి వారికి మెషిన్లతో (చెస్ట్ కంప్రెషర్స్) ఆక్సిజన్ అందిస్తున్నారు. కొందరికి పీసీఆర్ చేస్తున్నారు. కొందరికి వెంటిలేటర్లు అమర్చారు. వైద్యులు విరామం లేకుండా పనిచేయాల్సి రావడంతో వారి ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోంది. ఓ వైద్యుడు రోగిని పరీక్షిస్తూనే కుర్చీలోనే కుప్పకూలిపోవడం గమనించొచ్చు. వందలాది రోగులను కుర్చీల్లో వరుసగా కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కిస్తున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలపైకి చేరాయి. మరోపక్క, అక్కడి సర్కారు లెక్కల్లో చూపిస్తున్న దానితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయనే సమాచారం వినిపిస్తోంది. 


More Telugu News