అజింక్యా రహానె డబుల్ సెంచరీ.. టీమిండియాలోకి తిరిగి వస్తాడా?

  • హైదరాబాద్ తో రంజీ మ్యాచ్ లో చెలరేగిన అజింక్యా
  • సర్ఫరాజ్, యశస్వి జైస్వాల్ సెంచరీలు
  • 651/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ముంబై
భారత జట్టుకు దూరమైన అజింక్య రహానె రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ముంబై వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్ లో వరుసగా రెండో రోజు అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ గా ముంబైని నడిపిస్తున్న రహానె 261 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. తొలి రోజే సెంచరీ పూర్తి చేసుకున్న రహానె రెండో రోజు, బుధవారం ద్విశతకం సాధించాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్ (162), సర్ఫరాజ్ ఖాన్ (126 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో ముంబై తొలి ఇన్నింగ్స్ ను 651/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ 80 బంతుల్లో 90 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ మూడు వికెట్లు పడగొట్టగా, మెహ్రోత్ర శశాంక్ రెండు వికెట్లు తీశాడు. 

కాగా, ఒకప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రహానె తర్వాత ఫామ్ కోల్పోయాడు. వన్డేలతో పాటు టెస్టు జట్టులోనూ కోల్పోయాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై చివరగా టెస్టు మ్యాచ్ లో పాల్గొన్నాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో అతనికి చోటు దక్కడం లేదు. అయితే, రంజీ ట్రోఫీలో ద్విశతకంతో రహానె సెలక్టర్లను మెప్పించే ప్రయత్నం చేశాడు. గతంలో జాతీయ జట్టుకు దూరమైన చతేశ్వర్ పుజారా కూడా రంజీ ట్రోఫీలో రాణించి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో రహానె కూడా ఈ ప్రదర్శనతో టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.


More Telugu News