తెలంగాణపై చలి పంజా.. హైదరాబాద్​ కు ఎల్లో హెచ్చరిక జారీ

  • మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
  • ఏజెన్సీ గ్రామాల్లో ప్రజల ఇక్కట్లు
  • మరో నాలుగు రోజులు హైదరాబాద్ లో మరింతగా చలి 
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రిపూట సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో చలికి తోడు ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు(యూ) మండలంలో 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది రాష్ట్రంలోనే అత్యల్పం కావడం గమనార్హం. 

అదే సమయంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత మరింత పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  నగరంలో మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని తెలిపింది.


More Telugu News