కోహ్లీ, రోహిత్ శర్మలతో పోల్చదగ్గ ఆటగాడు పాకిస్థాన్ జట్టులో ఒక్కరూ లేరు: డానిష్ కనేరియా

  • పాక్, ఇంగ్లండ్ మధ్య ముగిసిన టెస్టు సిరీస్
  • 3-0తో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్
  • పాక్ ఆటగాళ్లలో మాటలు తప్ప చేతల్లేవన్న కనేరియా
  • సున్నా చుట్టారంటూ విమర్శలు
బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు సొంతగడ్డపై 0-3 తేడాతో ఇంగ్లండ్ కు టెస్టు సిరీస్ ను సమర్పించుకుంది. దాంతో బాబర్ అజామ్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించాడు. ప్రజలు ఇకనైనా బాబర్ అజామ్ ను విరాట్ కోహ్లీతో పోల్చడం మానేయాలని సూచించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పెద్ద ఆటగాళ్లని, వారితో పోల్చదగ్గ ఆటగాడు పాకిస్థాన్ జట్టులో ఒక్కరూ లేరని అన్నాడు. 

"మాటలు చూస్తే కోటలు దాటతాయి... ఫలితాలు చూపించండి అంటే మాత్రం సున్నా చుడతారు. టెస్టు కెప్టెన్సీ విషయంలో బాబర్ అజామ్ పెద్ద గుండు సున్నా. జట్టుకు నాయకత్వం వహించే సామర్థ్యం అతడికి ఎంతమాత్రం లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో అతడు కెప్టెన్ గా పనికిరాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా బెన్ స్టోక్స్, బ్రెండన్ మెకల్లమ్ వంటి వారి నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకునే అవకాశం బాబర్ కు లభించింది. లేకపోతే, తన ఇగోను పక్కనబెట్టి మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ ను అడిగి కెప్టెన్సీ ఎలా చేయాలో తెలుసుకోవాలి" అంటూ కనేరియా ఓ వీడియోలో వ్యాఖ్యానించాడు.


More Telugu News