మెస్సీ బృందానికి అర్జెంటీనాలో ఘనస్వాగతం... అర్ధరాత్రి దాటినా పోటెత్తిన అభిమానులు

  • ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా
  • ఖతార్ నుంచి రోమ్ మీదుగా అర్జెంటీనా చేరుకున్న మెస్సీ సేన
  • ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో పయనం
  • బ్యూనోస్ ఎయిర్స్ లో భారీ ర్యాలీ
సాకర్ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా జట్టుకు స్వదేశంలో అత్యంత ఘనస్వాగతం లభించింది. అర్జెంటీనా కాలమానం ప్రకారం రాత్రి 2 గంటలకు మెస్సీ బృందం బ్యూనోస్ ఎయిర్స్ చేరుకుంది. అర్ధరాత్రి దాటినప్పటికీ తమ ఆరాధ్య ఫుట్ బాల్ హీరోల కోసం అభిమానులు వేలాదిగా ఇజీజా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనాకు తీసుకువచ్చిన మెస్సీ, ఇతర జట్టు సభ్యులను చూసేందుకు పోటెత్తారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అర్జెంటీనా జట్టు ఖతార్ నుంచి రోమ్ మీదుగా బ్యూనోస్ ఎయిర్స్ కు ఓ ప్రత్యేక విమానంలో చేరుకుంది. ఈ విమానం మార్గమధ్యంలో ఉండగానే, ఈ విమానం ఇంకెంతసేపట్లో ల్యాండవుతుందన్న విషయాన్ని అభిమానులు ఓ యాప్ ద్వారా ట్రాక్ చేశారు. 1.76 లక్షల మంది ప్లేన్ ట్రాకింగ్ యాప్ సాయంతో ఆ విమానం ఎక్కడుందన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తమ అభిమాన ఆటగాళ్లను మోసుకొచ్చే విమానం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారట. 

అర్జెంటీనా టీమ్ ఎయిర్ పోర్టులో దిగగానే, వరల్డ్ చాంపియన్స్ అని రాసున్న బస్సులో వారిని తరలించారు. ఆ బస్సుపై మూడు స్టార్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అర్జెంటీనా మూడు పర్యాయాలు వరల్డ్ కప్ గెలిచిందన్న విషయాన్ని ఆ మూడు స్టార్లు చాటుతున్నాయి. 

రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లో జాతీయ జట్టు ఆటగాళ్లకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. రోడ్లకిరువైపులా అర్జెంటీనా జాతీయ పతాకాలు చేతబూని అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ఆటగాళ్లు వరల్డ్ కప్ ను ప్రదర్శిస్తూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.


More Telugu News