ఏ కేసు గురించి పిలిచారు అని అడిగినా ఈడీ అధికారులు సమాధానం చెప్పలేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

  • నిన్న రోహిత్ రెడ్డిని 6 గంటల సేపు విచారించిన ఈడీ  
  • ఈరోజు మళ్లీ విచారణకు హాజరుకానున్న రోహిత్ రెడ్డి
  • అన్ని డాక్యుమెంట్లతో రావాలన్న ఈడీ అధికారులు
మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 6 గంటల పాటు ఆయనను విచారించారు. మరోవైపు రోహిత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఏ కేసులో విచారిస్తున్నారో ఈడీ అధికారులను అడిగినా వారు చెప్పలేదని అన్నారు. 6 గంటల సేపు జరిగిన విచారణలో కేవలం తనకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న అంశాలపైనే ప్రశ్నించారని చెప్పారు. తన బయోడేటాను అడిగారని... పాస్ పోర్ట్, ఆధార్ జిరాక్స్ కాపీలను తీసుకున్నారని తెలిపారు. 

తనను ఎందుకు విచారణకు పిలిచారు? ఏం సమాచారం అడుగుతున్నారని ప్రశ్నించినా ఈడీ అధికారులు మౌనంగా ఉన్నారని చెప్పారు. తన వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. విచారణ అధికారులు అడిగిన సమాచారాన్ని ఇచ్చానని... పలువురు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పారు. 

మరోవైపు విచారణ సందర్భంగా... నోటీసుల్లో పేర్కొన్న డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకునేవి కాదని ఈడీ అధికారులకు రోహిత్ రెడ్డి తెలిపారు. ఆయా సంస్థల నుంచి వాటిని తీసుకోవాల్సి ఉందని... అందువల్ల తనకు కొంత సమయం ఇస్తే మీరు అడిగినవన్నీ ఇస్తానని చెప్పారు. రేపు అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. దీంతో, ఈరోజు ఆయన మళ్లీ విచారణకు హాజరుకానున్నారు.


More Telugu News