బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం!

  • దేశంలో 7.98 శాతం పెరిగిన వార్షిక నోట్ల చలామణి
  • గతేడాదితో పోలిస్తే ఈసారి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
  • క్రిప్టో ఏజెన్సీలకు చెందిన రూ. 907 కోట్ల ఆస్తుల అటాచ్
ఈ నెల రెండో తేదీ నాటికి దేశంలో వార్షిక నోట్ల చలామణి 7.98 శాతం పెరిగి రూ. 31.92 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్‌సభకు తెలిపారు. నగదు చలామణిని వీలైనంత వరకు తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించకుండా బ్యాంకులను ఆదేశించినట్టు చెప్పారు. 

అక్టోబరులో 7.01 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం నవంబరు నాటికి 4.67 శాతానికి దిగి వచ్చినట్టు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతేడాది 81,973 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది అవి 84,835 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు పేర్కొన్నారు. అలాగే, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి క్రిప్టో ఏజెన్సీలకు చెందిన రూ. 907 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, దీంతో సంబంధం ఉన్న ముగ్గురు అరెస్ట్ అయ్యారని తెలిపారు. అలాగే, బ్యాంకుల ప్రైవేటీకరణపైనా దృష్టి సారించినట్టు కేంద్రం తెలిపింది.


More Telugu News