నన్ను చూసి జాలిపడిన ఊరు ఇప్పుడు గర్వపడుతోంది: ఆదిరెడ్డి

  • బిగ్ బాస్ హౌస్ లో కామన్ మేన్ గా ఆదిరెడ్డి
  • తాజా ఇంటర్వ్యూలో తన గురించి ప్రస్తావన 
  • గతంలో పడిన కష్టాలు తలచుకుని కన్నీళ్లు
  • తన తల్లిలా ఎవరూ సూసైడ్ చేసుకోవద్దని విన్నపం 
  • కష్టాలు పడితేనే సుఖాల విలువ తెలుస్తుందని వ్యాఖ్య  
బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఆదిరెడ్డి కామన్ మేన్ గా వచ్చాడు. తన మాటకారితనంతో టాప్ 4 పొజిషన్లో ఉండగా హౌస్ నుంచి బయటికి వచ్చేయవలసి వచ్చింది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిరెడ్డి మాట్లాడుతూ .. "నేను కామన్ మేన్ ని .. నాకు ఎలాంటి ఫాలోయింగ్ లేదు. నాకు మాట్లాడటం తప్ప మరేమీ తెలియదు. కుండ బద్దలు కొట్టినట్టు నిజం మాట్లాడటమే నాకు తెలిసింది" అన్నాడు. 

"జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను .. కష్టాలు పడలేకనే మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. మా అమ్మ ఈ రోజున ఉంటే ఎంతో ఆనందపడేది. తొందరపడి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మా ఊళ్లో బయటికి వెళితే చాలు .. 'తిన్నావా' అని జాలిగా అడిగేవారు. తినడానికి ఏమీ లేదని తెలుసును గనుక అలా అడిగేవారు. నన్ను చూసి జాలిపడిన ఊరు .. నన్ను చూసి గర్వపడే స్థాయికి వచ్చాను .. అందుకు సంతోషంగా ఉంది" అని చెప్పాడు. 

శ్రీహాన్ ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నాడు. అందువలన ఆయన సూట్ కేస్ తీసుకోవడంలో తప్పులేదు. రేవంత్ కి ఆవేశం ఎక్కువైనా అది కాసేపే. నామినేషన్ సమయంలో నేను చెప్పే రీజన్ లో నిజాయతీ ఉంటుందని అంతా అంటూ ఉండేవారు. బిగ్ బాస్ హౌస్ లో నాకు బాగా నచ్చినవారి జాబితాలో గీతూ .. ఫైమా .. రాజ్ .. శ్రీ సత్య ఉంటారు. అందరూ జాలిపడిన ఆదిరెడ్డి కోసం ఈ రోజున అందరూ ఎగబడుతున్నారు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి?" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News