మొబైల్ డేటా వేగంలో భారత్ స్థానం 105

  • అక్టోబర్ తో పోలిస్తే నవంబర్ లో 8 స్థానాలు పైకి
  • సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 18.26 ఎంబీపీఎస్
  • 176.18 ఎంబీపీఎస్ వేగంతో ప్రపంచంలోనే ఖతార్ టాప్
మొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా భారత్ స్థానం కొంత మెరుగుపడింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్ ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. నవంబర్ నెలలో భారత్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 18.26 ఎంబీపీఎస్ గా ఉంది. కానీ, అక్టోబర్ లో ఈ సగటు వేగం 16.50 ఎంబీపీఎస్ గానే ఉంది. ఫలితంగా అక్టోబర్ లో ఉన్న 113వ ర్యాంక్ నుంచి భారత్ 105కి చేరింది. 

ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ వేగంలో మాత్రం భారత్ స్థానం దిగజారింది. సగటు వేగం విషయంలో భారత్ ర్యాంక్ 79 కాగా, నవంబర్ నెలకు 80కు పడిపోయింది. అలా అని బ్రాడ్ బ్యాండ్ వేగం తగ్గిందని అనుకుంటే పొరపాటే. నిజానికి వేగం అక్టోబర్ నెలలో ఉన్న 48.78 ఎంబీపీఎస్ నుంచి నవంబర్ లో 49.09కు పెరిగింది. అంతర్జాతీయంగా ఉన్న సగటు వేగంతో చూస్తే ఒక స్థానం తగ్గింది. 

ఖతార్ సగటు మొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో నిలిచింది. 176.18 ఎంబీపీఎస్ వేగం అక్కడ నమోదు అయింది. ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ లో చిలీ 216.46 ఎంబీపీఎస్ వేగంతో మొదటి స్థానంలో ఉంటే, 214.58 ఎంబీపీఎస్ వేగంతో చైనా తర్వాతి స్థానంలో నిలిచింది. పాలస్తీనా, భూటాన్ ర్యాంకులు అంతర్జాతీయంగా 14 స్థానాలు మెరుగుపడ్డాయి. మొబైల్ నెట్ వర్క్ సదుపాయాలు అయిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్, తదితర వసతులపై వేగం ఆధారపడి ఉంటుంది.  



More Telugu News