మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ ఆఫీసుకు రోహిత్ రెడ్డి

  • గడువు కావాలంటూ పైలట్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన అధికారులు
  • మధ్యాహ్నం రావాల్సిందేనని ఆదేశాల జారీ
  • ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసిన రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ రోజు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. తనకు మరికొంత సమయమివ్వాలని ఉదయం ఆయన చేసిన విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఆఫీసులో హాజరుకానున్నారు.

ఈడీ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కావాలి. ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి ముందుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. ఈడీ నోటీసులు, విచారణకు సంబంధించి సీఎం కేసీఆర్ తో మాట్లాడి బయటకు వచ్చారు. ఆపై తాను ఈ రోజు విచారణకు రాలేనంటూ ఈడీ అధికారులకు లేఖ రాసి, తన పీఏతో పంపించారు.

అయ్యప్ప మాలలో ఉండడంతో ఈ నెలాఖరు వరకు విచారణకు హాజరుకాలేనని పైలట్ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఇంకా.. తన, తన బంధువులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లు తీసుకురావడానికి బ్యాంకులో చాలా టైమ్ పడుతుందని పేర్కొన్నారు. తనకిచ్చిన తక్కువ సమయంలో అధికారులు కోరిన డాక్యుమెంట్లు సేకరించడం సాధ్యంకాదని వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తనకు మరింత సమయం ఇవ్వాలని, వచ్చే నెల 25న అన్ని డాక్యుమెంట్లతో విచారణకు హాజరవుతానని పైలట్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, పైలట్ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు.


More Telugu News