ఈడీ విచారణకు హాజరుకాని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. మరింత సమయం కావాలని విజ్ఞప్తి!

  • మరింత సమయం కావాలంటున్న తాండూరు ఎమ్మెల్యే
  • వచ్చే నెల 25 వరకు టైమివ్వాలని ఈడీ ఆఫీసుకు లేఖ
  • వరుస సెలవుల కారణంగా బ్యాంకు స్టేట్ మెంట్లు తీసుకోలేకపోయినట్లు వివరణ 
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ నేత, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం హాజరుకాలేదు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సేకరించడం పూర్తికాలేదని చెబుతూ తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. ఈమేరకు ఆయన ఈడీ అధికారులకు లేఖ రాసి వ్యక్తిగత సహాయకుడితో పంపారు.

బ్యాంకుకు వరుస సెలవుల నేపథ్యంలో తన ఖాతాకు సంబంధించిన స్టేట్ మెంట్లు తీసుకోలేక పోయానని అందులో పేర్కొన్నారు. వచ్చే నెల 25 వరకు టైమివ్వాలని పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. దీనిపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కర్ణాటక డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ పీఎంఎల్ఏ కింద తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసుకు రావాలని ఆ నోటీసులలో సూచించింది. ఉదయం వరకూ రోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారనే అంతా భావించారు. అంతకుముందు తన న్యాయవాదితో ఈడీ నోటీసులపై రోహిత్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం పదకొండు గంటలకు తాను విచారణకు రాలేనంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు తెలిపారు.


More Telugu News