వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మావే: మంత్రి రోజా

  • ఆంధ్రప్రదేశ్ లో అన్ని సీట్లు గెల్చుకుంటామని మంత్రి ధీమా
  • పర్యాటక రంగంపై జగన్ సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్న మంత్రి
  • టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లను వైసీపీ గెల్చుకుంటుందని ఆ పార్టీ నేత, మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం లంబసింగి పర్యటనకు వెళ్తూ అనకాపల్లి జిల్లాలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో జగన్ సర్కారు ఆదుకుంటోందని చెప్పారు. జగన్ పాలనతో రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధివైపు పరుగులు పెడుతోందని జనం నమ్ముతున్నారని మంత్రి చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి రోజా చెప్పారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టూరిజం మినిస్టర్ రోజా చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్రంలో టూరిజం పుంజుకుందని, టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని చెప్పారు. టూరిస్టు ప్రాంతాల్లో వసతుల కల్పన కోసం ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని వివరించారు. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని మంత్రి రోజా చెప్పారు.

తాము అధికారంలోకి రాగానే.. జగన్ సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలను, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ ప్రకటించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. ఇప్పుడు మాటమార్చి, సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని రోజా విమర్శించారు. టీడీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.


More Telugu News