మాచర్ల హింసలో బాధితులనే నిందితులుగా చేస్తారా?: పోలీసు ఉన్నతాధికారులపై చంద్రబాబు ఆగ్రహం

  • మాచర్ల ఘటనపై పోలీసుల తీరుపై మండిపడ్డ టీడీపీ అధినేత
  • పల్నాడు జిల్లా ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • ఎస్పీ రవిశంకర్ రెడ్డిని వెంటనే తొలగించాలని డిమాండ్
మాచర్లలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనపై పోలీసులు స్పందించిన తీరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ఈ ఘటనలో బాధితులనే నిందితులుగా చేస్తున్నారంటూ ఉన్నతాధికారులపై చంద్రబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా ఎస్పీ తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఏ హోంగార్డునైనా సరే రవిశంకర్ రెడ్డి స్థానంలో కూర్చోబెడితే ఇంతకన్నా సమర్థవంతంగా పనిచేస్తారని చంద్రబాబు చెప్పారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి లాంటి అధికారులు పోలీసు డిపార్ట్ మెంట్ కే తలవంపులని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను పణంగా పెట్టి, మాచరల్లో వైసీపీ అరాచక శక్తులకు సహకరిస్తున్న ఎస్పీ రవిశంకర్ రెడ్డిని వెంటనే తొలగించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం జరుగుతుండగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు.


More Telugu News