సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

  • ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల సమస్యలపై లేఖ
  • 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు నిరాశేనన్న రేవంత్
  • హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడంలేదని విమర్శలు
  • అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల సమస్యలను తన లేఖలో ప్రస్తావించారు. 

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిల్చారని విమర్శించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అభ్యర్థులు తమ ఆవేదనను ట్విట్టర్ ద్వారా కేటీఆర్, డీజీపీకి విన్నవించుకున్నా సమాధానం రాలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంబంధిత శాఖను చూసే హోంమంత్రి ఉన్నారో లేదో తెలియదని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇవేమీ పట్టించుకోకుండా మీరు బీఆర్ఎస్ అంటూ దేశమంతా తిరుగుతున్నారు అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. పరిపాలన ఈ విధంగా ఉంటే ఉద్యోగార్థుల సమస్యలు తీర్చేదెవరు? అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశించిన మేరకు ప్రిలిమినరీ పరీక్షలోని ఏడు ప్రశ్నలను తొలగించి, అభ్యర్థులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


More Telugu News