బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై రివ్యూ పిటిషన్​ కొట్టేసిన సుప్రీంకోర్టు

  • బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మందికి జీవిత ఖైదు
  • గుజరాత్ రిమిషన్ పాలసీ ప్రకారం ఈ ఆగస్టులో విడుదలైన వైనం
  • దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితులు
బిల్కిస్ బానో అత్యాచార కేసులో రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు శనివారం కొట్టి వేసింది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభ‌వించిన 11 మందిని రిమిషన్ పాలసీ ప్రకారం గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అత్యాచార బాధితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిష‌న్ వేశారు. అయితే, ఈ పిటిష‌న్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గుజరాత్ గోద్రా అల్ల‌ర్ల నేప‌థ్యంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2008లో నమోదైన ఈ కేసుకు సంబంధించి 11 మంది దోషులుగా తేలారు. వారికి కోర్టు జీవిత‌ ఖైదు విధించింది. 

అయితే, ఈ ఏడాది ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి వీరు బయటికి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ–2002 ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతించింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గుజరాత్, కేంద్రంలోని అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. గుజరాత్‌లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. అప్పటికి ఆమె ఐదు నెలల గర్భిణి. ఈ అల్లర్లలో చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యుల్లో ఆమె మూడేళ్ల కూతురు కూడా ఉంది.


More Telugu News