లివర్ ట్యాక్సిన్లను సహజంగా శుద్ధి చేసుకోవచ్చు ఇలా..!

  • పలు రకాల ఔషధాలు, ఉత్పత్తుల రూపంలో శరీరంలోకి విషతుల్యాలు
  • వీటిని కాలేయం ఎప్పటికప్పుడు శుద్ధి చేయాల్సిందే
  • కొన్ని రకాల ఆహారాలు ఈ ప్రక్రియకు మేలు చేస్తాయ్
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఎంత ముఖ్యమైన పనులను నిర్వహిస్తాయో.. కాలేయం కూడా అంతే. మన శరీరంలో హానికారకాలను కాలేయమే నిర్వీకరణం చేస్తుంది. హానికారక విషతుల్యాలు, మలినాలను శుద్ధి చేసి, అదే సమయంలో జీర్ణానికి వీలుగా బైల్ ను (పైత్యరసాన్ని) ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ విషతుల్యాలను ఎప్పటికప్పుడు కాలేయం శుద్ధి చేయకపోతే కణాలకు నష్టం జరుగుతుంది. 

టాక్సిన్లు అంటే..?
ఔషధాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అయిన షాంపూ, సబ్బులు, పెర్ ఫ్యూమ్, డియేడరెంట్, పురుగు మందుల రూపంలో మన శరీరంలోకి విషతుల్యాలు చేరతాయి. వీటిని కాలేయం శుద్ధి చేసి, నీటిలో కరిగిపోయే విధంగా మార్చేస్తుంది. దీంతో మూత్రం ద్వారా అవి బయటకు వెళ్లిపోతుంటాయి. మొదటి దశలో కాలేయం విషతుల్యాలను విచ్ఛిన్నం చేసి, రెండో దశకు పంపిస్తుంది. అక్కడ శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రాసెస్ సరిగ్గా జరగకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది సాఫీగా సాగాల్సిందే.

ఏవి తినాలి?
కాలేయంలో శుద్ధి సరిగ్గా జరగకపోతే మొటిమలు, ఒత్తిడి, అధిక ఆకలి, మలబద్ధకం, అజీర్ణం, ఇన్ ఫ్లమేషన్ తదితర సమస్యలు ఎదురవుతాయి. అందుకని కాలేయంలో టాక్సిన్ల క్లీనింగ్ సరిగ్గా జరిగేందుకు మనవంతు కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవాలి. వేప, వెల్లుల్లి, కాఫీ, గ్రీన్ టీ, ద్రాక్ష, ఓట్ మీల్ ఈ ప్రక్రియకు మేలు చేస్తాయి. ఇంకా పుచ్చకాయ, బొప్పాయి, నిమ్మకాయ, అవకాడో, బ్రొకోలీ, క్యారట్లు, ఫిగ్స్, అరటి పండ్లు, బీట్ రూట్ కూడా మంచి చేస్తాయి.


More Telugu News