న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించే వారు 23 లోపు దరఖాస్తు చేసుకోండి!: రాచకొండ పోలీసులు

  • 23 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్న రాచకొండ పోలీసులు
  • జంటల కోసం ఏర్పాటు చేసే ఈవెంట్లలో మైనర్లను అనుమతించకూడదన్న పోలీసులు
  • ఈవెంట్లకు హాజరయ్యే వారివద్ద గుర్తింపు కార్డులు ఉండాల్సిందే
  • డీజేలకు అనుమతి నిరాకరణ
న్యూ ఇయర్ సందర్భంగా పార్టీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు డిసెంబరు 23న సాయత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని రాచకొండ పోలీసులు సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈవెంట్స్ నిర్వహించాలనుకునేవారు అనుమతుల కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వాటిని నేరేడ్‌మెంట్ రాచకొండ ఇన్‌వార్డ్ సెక్షన్‌‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 

హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు సహా నగరంలోని ఈవెంట్ ఆర్గనైజర్లకు తెల్లవారుజామున ఒంటిగంట వరకు మాత్రమే పార్టీలు, ఈవెంట్లకు అనుమతి ఉంటుంది. అయితే, జంటల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలో మైనర్లను అనుమతించకూడదు. ఈవెంట్లకు హాజరయ్యే వారి వయసును తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాల్సిందే. ఇందుకోసం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు తప్పనిసరి. అలాగే, ఈవెంట్లు, ఇతర కార్యక్రమాల్లో డీజేలు ఉండడానికి వీల్లేదని, కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శనలు పొరుగు ప్రాంతాలకు ఇబ్బంది కలిగించకూడదని పోలీసులు పేర్కొన్నారు.


More Telugu News