మూవీ రివ్యూ: 'అవతార్ .. ది వే ఆఫ్ వాటర్'

  • జేమ్స్ కామెరున్ నుంచి 'అవతార్ 2'
  • ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజునే విడుదలైన సినిమా 
  • యాక్షన్ ను .. ఎమోషన్ ను కలుపుకుని నడిచే కథ 
  • అడుగడుగునా ఆశ్చర్యచకితులను చేసే దృశ్యాలు 
  • అద్భుతమైన విజువల్ ట్రీట్ గా అనిపించే సినిమా
'అవతార్' .. ప్రపంచ సినిమా రూపురేఖలను కొత్త మలుపు తిప్పిన సినిమా. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెరపై ఈ తరహా అద్భుతాలు కూడా చేయవచ్చని నిరూపించిన సినిమా. ఊహాతీతమైన లోకాన్ని సృష్టించి ..  అక్కడ లవ్ .. ఎమోషన్ .. ఆధ్యాత్మికతను ఆవిష్కరిస్తూ నడిచిన ఈ సినిమా,  2009 నుంచి ఇంతవరకూ ప్రేక్షకుల మనోఫలకం నుంచి చెదిరిపోలేదు. జేమ్స్ కామెరున్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకి సీక్వెల్ గా 'అవతార్ .. ది వే ఆఫ్ వాటర్' రూపొందింది. 

సామ్ వర్థింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, మిచెల్లీ రోడ్రిగెజ్, జోయెల్ డేవిడ్ మూరే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జేమ్స్ కామెరున్ దర్శక, నిర్మాతగా వ్యవహరించాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో 50 వేలకి పైగా స్క్రీన్స్ పై ఈ సినిమా ఈ రోజున విడుదలైంది. జేమ్స్ హార్నర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందనేది చూద్దాం. 

 కథలోకి వెళితే ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి కొంతమంది సైంటిస్టులు పండోరా అటవీ ప్రాంతాన్ని ప్రధానంగా కలిగిన 'అవతార్' లోకానికి జేక్స్ ను పంపిస్తారు. 'అవతార్' రూపు రేఖలను కలిగిన జేక్స్ .. అక్కడి ప్రజలకి చేరువై, అక్కడి యువతి ప్రేమలో పడతాడు. ఆ జంటకు ఇద్దరు మగపిల్లలు .. ఇద్దరు ఆడపిల్లలు కలుగుతారు. ఆ అటవీ ప్రాంతం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ, వాళ్లంతా ఎంతో హ్యాపీగా కాలం గడుపుతూ ఉంటారు. అరణ్య వాసుల ఎమోషన్స్ కి కనెక్ట్ అయిన జేక్స్, తన అధికారులు తనకి అప్పగించిన పనిని చేయడానికి నిరాకరిస్తాడు. 

జేక్స్ ధోరణి అధికారులకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఆయన అంతు చూడటమే ప్రధానమైన ఉద్దేశంగా వారు క్వారిచ్ అనే ఆర్మీ అధికారిని రంగంలోకి దింపుతారు. 'అవతార్' ప్రజలకు భిన్నంగా కనిపించేవారు ఆ అడవి నుంచి ప్రాణాలతో బయటపడలేరనే విషయం అధికారులకు తెలుసు. అందువలన క్వారిచ్ .. అతని సహచరులు అందరూ కూడా ప్రయోగశాల ద్వారా 'అవతార్' లోకంలోని నీలిజాతికి చెందినవారిగా మారిపోతారు. పండోరా అటవీ ప్రాంతంలోకి రహస్యంగా అడుగుపెడతారు. 

జేక్స్ నలుగురు పిల్లలు అడవిలో ఆటపాటలతో గడుపుతూ ఉంటారు. ఆ సమయంలోనే వాళ్లకు చిత్రమైన పాదాల ముద్రలు కనిపిస్తాయి. ఆ విషయాన్ని వారు జేక్స్ కి తెలియజేస్తారు. ఆయన వచ్చేలోగానే, ఆ పిల్లలను క్వారిచ్ బంధిస్తాడు. జేక్స్ .. అతని భార్య ఇద్దరూ కలిసి మెరుపుదాడి చేసి, ఆ పిల్లలను కాపాడుకుని తీసుకువెళతారు. ఇక తమ కారణంగా అరణ్యవాసులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, తన ఫ్యామిలీతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని జేక్స్ నిర్ణయించుకుంటాడు. 

తన కుటుంబంతో కలిసి జేక్స్ ఓ సముద్ర తీరప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడి నాయకుడి ఆశ్రయం పొందుతాడు. సముద్ర జీవులను వాళ్లంతా కన్నబిడ్డల్లా చూసుకుంటారనే విషయం ఆయనకి అర్థమవుతుంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా సముద్ర జీవులతో కలిసి ఎలా జీవించాలో తెలుసుకుంటారు. జేక్స్ తన మకాం మార్చాడని తెలుసుకున్న క్వారిచ్, ఆయనను అంతమొందించేందుకు తన సైనిక బలగంతో ఆ ప్రాంతానికి బయల్దేరతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? జేక్స్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ. 

ఆల్రెడీ 'అవతార్' సృష్టించిన సంచలనం కారణంగా, దర్శకుడిగా జేమ్స్ కామెరున్ ప్రతిభా పాటవాలను గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కథా కథనాలతో ఆయన ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించాడు .. ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆకాశవాసులు .. అరణ్యవాసులు .. సముద్రవాసులు అంటూ, ఈ మూడింటిని కనెక్ట్ చేస్తూ ఆయన అందించిన విజువల్ ట్రీట్ ను చూసితీరవలసిందే. 

ఒక వైపున హీరో హీరోయిన్స్ .. మరో వైపున విలన్ .. ఇంకో వైపున రెండు తెగలకు చెందిన పిల్లలు. ఈ మూడు కోణాల్లోని పాత్రలను దర్శకుడు అద్భుతంగా మలిచి ఆవిష్కరించాడు. ఏ సీన్ కూడా అనవసరం అనిపించదు. పిల్లల పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వారి ట్రాక్ ను హైలైట్ చేసిన విధానం .. క్లైమాక్స్ వరకూ వారి భాగస్వామ్యాన్ని ఉంచిన పద్ధతి ఆకట్టుకుంటాయి. 'ది వే ఆఫ్ వాటర్' అన్నట్టుగానే సముద్రగర్భంలోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. 

ఒక వైపున అత్యంత ఆధునికమైన యుద్ధవిమానాలు .. సబ్ మెరైన్లు, మరో వైపున అడవీ నేపథ్యంలో పక్షులను వాహనాలుగా చేసుకుని 'అవతార్' ప్రజలు చేసే యుద్ధ విన్యాసాలు .. మరో వైపున సముద్ర గర్భంలోను జరిగే చేజింగ్స్ .. ఈ దృశ్యాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు పడేవరకూ ఊపిరి బిగబట్టి చూడవలసిందే. పట్టువదలకుండా .. పట్టు సడలకుండా దర్శకుడు చేసిన కసరత్తు, జేమ్స్ హార్నర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మారో ఫియోరో కెమెరా వర్క్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. 

 'నువ్వు నిలబడిన నేల కోసం .. నిన్ను నమ్ముకున్నవారి కోసం .. నువ్వు నమ్మిన విశ్వాసం కోసం పోరాడు. నీ వారిని కాపాడుకోవాలంటే చేయవలసింది పారిపోవడం కాదు .. చివరి నిమిషం వరకూ పోరాడటం' అనే సందేశం ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది. బలమైన కథాకథనాలు .. దానిని అద్భుతంగా ఆవిష్కరించే టెక్నాలజీ ఈ సినిమాకి ప్రాణంగా కనిపిస్తాయి. యాక్షన్ తోను  .. ఎమోషన్ తోను కలిసి నడిచే ఈ కథను చూస్తుంటే, గగనతలంలోను .. అరణ్య మార్గంలోను .. సముద్రమార్గంలోను ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన విజువల్ ట్రీట్ ఈ సినిమా అని చెప్పచ్చు.


More Telugu News