పాంక్రియాటిక్ కేన్సర్ ఉందని హెచ్చరించే సంకేతాలు..!

  • కడుపులో ఒత్తిడితో కూడిన నొప్పి ఒక సంకేతం
  • విడవని నడుం నొప్పి వచ్చినా నిర్లక్ష్యం వద్దు
  • కారణం లేకుండా బరువు తగ్గడం మంచిది కాదు
  • మధుమేహం బారిన పడడం, అలసట దీని లక్షణాలే
తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో సాయపడే వాటిల్లో పాంక్రియాస్ ముఖ్యమైనది. ఇది కడుపులో దిగువ భాగంలో ఉంటుంది. పాంక్రియాటిక్ కేన్సర్ కేసులు పెరుగుతున్న క్రమంలో దీనికి సంబంధించి సమాచారం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. శరీర అంతర్భాగం కనుక పాంక్రియాస్ లో వచ్చే మార్పులు వెంటనే బయటపడవు. కుటుంబంలో పాంక్రియాటిక్ కేన్సర్ బాధితుల చరిత్ర ఉంటే, పొగతాగడం, నియంత్రణలో లేని మధుమేహం, పాంక్రియాస్ లో తీవ్ర ఇన్ ఫ్లమేషన్, జన్యు సంబంధిత సమస్యలు పాంక్రియాటిక్ కేన్సర్ వెనుక కారణాలుగా ఉంటున్నాయి. పాంక్రియాటిక్ కేన్సర్ వచ్చిన వారిలో కనిపించే సాధారణ లక్షణాలను గమనించినట్టయితే..

కడుపులో విడవకుండా నొప్పి
కడుపులో విడవకుండా నొప్పి వస్తుంటే అది పాంక్రియాటిక్ కేన్సర్ అయి ఉండొచ్చు. ఒత్తిడితో కూడిన నొప్పి ఇక్కడ కీలకం. తొలుత కొద్దిగానే మొదలైనా నొప్పి తీవ్రతరం అవుతుంది. 

నడుం నొప్పి
పాంక్రియాటిక్ కేన్సర్ వచ్చి దాని తాలూకూ ఒత్తిడి ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు నడుం నొప్పిగా అనిపిస్తుంటుంది. తరచూ బ్యాక్ పెయిన్ వస్తుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. 

చర్మంపై దురదలు
బైలురూబిన్ చర్మంలో పేరుకుంటున్నప్పుడు అది చర్మంపై దురద రూపంలో కనిపిస్తుంది. చర్మం రంగు లేత పసుపులోకి మారుతుంది.

అకారణంగా బరువు తగ్గడం
బరువు తగ్గడానికి సాధారణంగా ఎన్నో కారణాలు ఉంటుంటాయి. పాంక్రియాటిక్ కేన్సర్ లోనూ బరువు తగ్గుతారు. కేన్సర్ వృద్ధి చెందుతున్న కొద్దీ అది శరీరంలోని శక్తిని హరిస్తుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. పాంక్రియాస్ లో ట్యూమర్ కాలేయాన్ని అదిమి పెడుతుంటుంది. దీనివల్ల ఆకలి తెలియదు. పాంక్రియాస్ సరిగ్గా పనిచేయనప్పుడు తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగా అందవు.

జీర్ణాశయ సమస్యలు
మలం లేత రంగులో ఉండి, జిడ్డు మాదిరి లేదంటే నీళ్ల విరేచనాలు అవుతుంటే, దుర్వాసన వస్తుంటే అది కూడా పాంక్రియాటిక్ కేన్సర్ సంకేతం కావచ్చు. బైల్ డక్ట్ (పిత్త వాహిక)కు అవరోధం ఏర్పడినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో శరీరం కొవ్వులను సరిగ్గా జీర్ణం చేసుకోలేదు.

చర్మం, కళ్లు రంగు మారడం
కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారిపోతే నిర్లక్ష్యం చేయకూడదు. కాలేయ సమస్య లేదా కామెర్లు అయి ఉండొచ్చు. పాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.

మూత్రం
మూత్రం చిక్కటి రంగులో విడుదల అవుతుండడం కూడా మరో సంకేతమే. రక్తంలో బైలురూబిన్ పెరిగినప్పుడు ఇలా మూత్రం బ్రౌన్ రంగులోకి మారిపోతుంది.

ఒక్కసారిగా మధుమేహం
వృద్ధాప్యంలో మధుమేహం ఒక్కసారిగా వస్తే అందుకు కారణం పాంక్రియాటిక్ కేన్సర్ అయి ఉండొచ్చు. ఇన్సులిన్ ను తయారు చేసే కణాలను కేన్సర్ చంపేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది.

అలసట
ఏ కారణం లేకుండా తీవ్ర అలసట అనిపిస్తుంటే నిర్లక్ష్యం పనికిరాదు. పాంక్రియాటిక్ కేన్సర్ అనే కాదు.. మరే కేన్సర్ లో అయినా తీవ్ర అలసట కనిపిస్తుంది.


More Telugu News