కేసీఆర్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా

  • ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర
  • కరీంనగర్ లో సభ.. హాజరైన జేపీ నడ్డా
  • బీజేపీకి అధికారం, కేసీఆర్ కు విశ్రాంతి అవసరమన్న నడ్డా  
  • బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ కానుందని వ్యంగ్యం
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. 'వేములవాడ రాజన్నకు ప్రణామాలు, కొండగట్టు అంజన్నకు ప్రణామాలు' అంటూ నడ్డా తన ప్రసంగం ప్రారంభించారు. ఉద్యమాల గడ్డ కరీంనగర్ అని పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం మాత్రమేనని, ఇది ఆగేదికాదని నడ్డా స్పష్టం చేశారు. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం కూడా కొనసాగుతుందని వెల్లడించారు. 

తెలంగాణను కేసీఆర్ అప్పులకుప్పగా మార్చేశారని, అందినంత దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజలు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నడ్డా వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం, కేసీఆర్ కు విశ్రాంతి అవసరం అని పేర్కొన్నారు.  

కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ కానుందని ఎద్దేవా చేశారు. ఒక దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని నడ్డా ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్ కు కుటుంబ పాలన తప్ప ప్రజాసంక్షేమం గురించి ఆలోచన ఉండదని అన్నారు. బీజేపీ మాత్రమే కేసీఆర్ ను గద్దె దించగలదని నడ్డా ఉద్ఘాటించారు.


More Telugu News