కండరాల నొప్పులు తగ్గడానికి ఉపయోగపడే ఆహారం

  • ఒత్తిడి ఎక్కువై, విశ్రాంతి తక్కువైతే కండరాల సమస్యలు
  • తగినంత విశ్రాంతి ఇవ్వడం అవసరం
  • పాలకూర, పుచ్చకాయ, చేపలు, అరటిపండు, పసుపుతో మంచి ఫలితాలు
కూర్చోవడం ఎక్కువ.. కదలికలు తక్కువ.. ఈ విధమైన జీవనశైలితో దీర్ఘకాలంలో కండరాల సమస్యలు వేధిస్తాయి. అలా కండరాల సమస్యలతో బాధపడే వారు, తమ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణుల సూచన.

పాలకూర
దీన్ని సూపర్ ఫుడ్ అని చెబుతారు. తరిగిన కప్పు పాలకూరలో ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ పై పోరాడే విటమిన్ ఏ, బీ, సీ దీని ద్వారా లభిస్తాయి. అందుకని కండరాల సమస్యలతో బాధపడేవారు, ఆరోగ్యవంతులు సైతం దీన్ని తరచుగా తీసుకోవడం మంచిది. 

పుచ్చకాయ
ఆరోగ్యం కోసం రోజులో 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలన్నది వైద్యుల సూచన. దీనివల్ల కండరాలకు మంచి బలం లభిస్తుంది. కండరాలపై ఒత్తిడి తగ్గి, చురుకుదనం వస్తుంది. ఇలా వ్యాయామం చేసిన తర్వాత తీసుకోతగిన ఆహారాల్లో పుచ్చకాయకు మొదటి ఓటు పడుతుంది. ఎందుకంటే వ్యాయామంతో శరీరం నుంచి నీరు, కొంత లవణాలను కోల్పోతాం. వీటిని భర్తీ చేయడానికి పుచ్చకాయను ముంచింది లేదు. ఇందులో 92 శాతం నీరే. పైగా విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

అరటి పండ్లు
ఇందులో ఐరన్, ఫైబర్, ఫొలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ లభిస్తాయి. కండరాల పుష్టికి అరటి సాయపడుతుందని పెద్దలు చాలా మంది చెబుతుంటారు. కండరాల ఆరోగ్యానికి ముఖ్యమైన పొటాషియం ఇందులోనూ తగినంత లభిస్తుంది. 

చేపలు
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కండరాల్లో ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. ప్రొటీన్ కూడా లభిస్తుంది. 

సిట్రస్ జాతి పండ్లు 
సిట్రస్ జాతికి చెందిన నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, కివీతోపాటు టమాటాల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా, చురుగ్గా ఉండడంలో విటమిన్ సీ ఎంతో అవసరం. కండరాల నొప్పులకు సైతం మంచి ఫలితం వస్తుంది. 

పసుపు
వంటింటి ఔషధ దినుసు అయిన పసుపు (టర్మరిక్) సైతం కండరాల సమస్యలను తగ్గించడంలో ఔషధంగా పనిచేస్తుంది. పసుపుకు ఎన్ని అద్భుత గుణాలు ఉన్నాయో ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. యాంటీ సెప్టిక్ గా, యాంటీ బయోటిక్ గా, యాంటీ ఇన్ ఫ్లమ్మేటర్ గా పసుపు పనిచేస్తుంది. గోరువెచ్చని గ్లాసు నీటిలో చిటికెడు పసుపు వేసుకుని నిత్యం తాగొచ్చు.


More Telugu News