ఈ ఏడాది ఈ ఇద్దరు డైరెక్టర్లకు కలిసి రాలేదు!

  • టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి, కొరటాల శివ 
  • ఆ తరువాత స్థానంలో నిలిచిన అనిల్ రావిపూడి 
  • 'లైగర్' తో దెబ్బతిన్న పూరి 
  • 'ఆచార్య'తో అవస్థలు పడిన కొరటాల
  • తదుపరి ప్రాజెక్టులపైనే ఆశలు   
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లోని రాజమౌళి .. పూరి .. కొరటాల .. అనిల్ రావిపూడి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తమ భారీ ప్రాజెక్టులను తీసుకుని వచ్చారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో రాజమౌళి సంచలన విజయానికి సరికొత్త అర్థం చెప్పారు. ఇటు ఎన్టీఆర్ .. అటు చరణ్ కెరియర్ లో మరిచిపోలేని ఒక మైలురాయిని నిలబెట్టారు. ఇక అనిల్ రావిపూడి కూడా 'ఎఫ్ 3' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేశారు. 

ఇదే ఏడాదిలో పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా నిర్మితమైన ఈ సినిమాకి పూరి నిర్మాతగా కూడా ఉన్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. నిర్మాతగా పూరిని మరింత ఇబ్బందులలోకి నెట్టింది. అదిరిపోయే డైలాగ్స్ రాసే పూరి, హీరోకి నత్తి పెట్టడం .. అవసరం లేకపోయినా మైక్ టైసన్ ను రంగంలోకి దింపడం సినిమా ఫలితాన్ని దెబ్బకొట్టాయి. 
 
రాజమౌళి తరువాత అపజయమనేది ఎరుగని దర్శకులుగా అనిల్ రావిపూడికి .. కొరటాలకి మంచి పేరు ఉంది. కానీ ఇప్పుడు ఆ జాబితాలో కొరటాల కనిపించరు. అందుకు కారణం ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన 'ఆచార్య' పరాజయంపాలు కావడమే. నిర్మాణపరమైన వ్యవహారాల్లోను కొరటాల జోక్యం ఉండటం వలన, ఆయన బాగానే ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్టులతోనైనా ఈ ఇద్దరికీ హిట్ దొరుకుతుందేమో చూడాలి.


More Telugu News